Virat: టీ20 సారథ్యం నుంచి తప్పుకోవద్దని కోహ్లీని కోరాం: చీఫ్‌ సెలెక్టర్‌

telugu news, cricket news, sports news,virat kohli,chetan sharma

Published : 31 Dec 2021 22:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వన్డే సారథి ఎంపికపై బీసీసీఐ, విరాట్‌ కోహ్లీ మధ్య ఎలాంటి గందరగోళం లేదని టీమ్‌ఇండియా సెలెక్షన్‌ కమిటీ చీఫ్‌ చేతన్‌ శర్మ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన అనంతరం చేతన్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘టీ20 ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు మీటింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా బీసీసీఐలోని ప్రతి ఒక్కరూ టీ20 ఫార్మాట్‌ కెప్టెన్సీని వదిలేయొద్దని కోహ్లీకి అడిగారు. మళ్లీ పునరాలోచించాలని సూచించారు. ఇది ప్రపంచకప్‌ పోటీల్లో మన జట్టు ఆటపై ప్రభావం పడుతుందని మా సెలెక్టర్లందరం చెప్పి చూశాం. భారత క్రికెట్‌ కోసం కొనసాగాలని సూచనలు చేశాం. అయితే టీ20 ప్రపంచకప్‌ తర్వాత కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పడంతో మేం షాక్‌కు గురయ్యాం’’ అని వివరించారు. 

టీ20 ప్రపంచకప్‌ ముగిసేవరకు సారథ్యంపై ఎలాంటి నిర్ణయం వెలువరించవద్దని బీసీసీఐ సహా సెలెక్షన్‌ కమిటీ బృందం కోహ్లీకి చెప్పిందని చేతన్ శర్మ గుర్తు చేశారు. ‘‘టీ20 కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు విరాట్ ప్రకటించినప్పుడు వరల్డ్‌ కప్‌ పోటీల మధ్యలో ఉన్నాం. అప్పటికీ పునరాలోచించుకోవాలని ప్రతి సభ్యుడూ చెప్పారు. ఒకవేళ ఏదైనా ఒక ఫార్మాట్‌ నుంచి కెప్టెన్‌గా వైదొలిగితే.. మరొక ఫార్మాట్‌ను కూడా వదులుకోవాల్సి వస్తుందని అప్పుడు మేం చెప్పలేని సమయం. ఎందుకంటే టీమ్‌ఇండియా లక్ష్యాలను అందుకునేలా చేయడమే మా కర్తవ్యం. అందుకే ఎలాంటి వివాదాలకు పోవాలనుకోలేదు. దేశం కోసం ఉత్తమ ఆటగాళ్లు ఆడేలా చూస్తాం’’ అని పేర్కొన్నారు. మరోవైపు విరాట్, రోహిత్ మధ్య దూరం పెరిగిందనే వార్తలను చేతన్‌ శర్మ కొట్టిపడేశారు. ఇలాంటి ఊహాగానాలను చూసినప్పుడు నవ్వొస్తుందని, ఇటువంటి నిరాధార వార్తలను వ్యాప్తి చేయొద్దని సూచించారు. వారిద్దరూ ఓ కుటుంబంలా, జట్టుగా కలిసిమెలిసి భారత క్రికెట్‌ కోసం పని చేస్తున్నారని చేతన్‌ శర్మ తెలిపారు.

విరాట్ కోహ్లీ స్థానంలో టీ20, వన్డే సారథిగా రోహిత్ శర్మను సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. విరాట్‌ను కేవలం టెస్టు జట్టు బాధ్యతలకు మాత్రమే పరిమితం చేసింది. దీంతో ఒక్కసారిగా వివాదానికి దారి తీసింది. మాజీల నుంచి విమర్శలు రావడంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించాడు. తొలుత టీ20 జట్టు కెప్టెన్‌గా కొనసాగాలని తాము కోహ్లీని కోరామని, అందుకు అతడు నిరాకరించాడని తెలిపాడు. తెల్లబంతి క్రికెట్‌ (వన్డే, టీ20) ఫార్మాట్లకు ఒకే సారథి ఉంటే బాగుంటుందని సెలెక్షన్‌ కమిటీ భావించడంతో రోహిత్ శర్మనే ఎంపిక చేసినట్లు వివరించాడు. అయితే దీనికి విరుద్ధంగా కోహ్లీ స్పందిస్తూ.. వన్డే కెప్టెన్‌గా తొలగిస్తున్నట్లు కేవలం గంటన్నర ముందు మాత్రమే చెప్పారని, టీ20 సారథ్యం వదులుకోవద్దని తనను ఎవరూ వారించలేదని వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని