
Tokyo Olympics: పురుషుల ఆర్చరీ.. కొరియా చేతిలో ఓటమి.. శరత్ కమల్ జోరు
టోక్యో: విలువిద్య బృంద పోటీల్లో భారత్ కథ ముగిసింది. పురుషుల బృంద పోటీల్లో అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్‌తో కూడిన జట్టు వెనుదిరిగింది. డిఫెండింగ్ ఛాంపియన్, బలమైన కొరియా చేతిలో 6-0 తేడాతో ఓటమి పాలైంది. టీమ్‌ఇండియా వరుసగా మూడు సెట్లలో తేలిపోవడం గమనార్హం.
ఈ పోటీల్లో ఒక్కో సెట్లో ఆరు బాణాలు గురి పెట్టాలి. ఒక జట్టులో ముగ్గురు ఆటగాళ్లు ఉంటారు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు ఒక్కో బాణం రెండుసార్లు ఎక్కు పెట్టాలి. మొదటి సెట్లో భారత్ 54 మాత్రమే చేయగా కొరియా 59తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సెట్లో టీమ్‌ఇండియా ప్రదర్శన కాస్త మెరుగైంది. 57 స్కోర్ చేసింది. కానీ కొరియా మళ్లీ 59తో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కీలకమైన మూడో సెట్లోనూ 54 మాత్రమే చేయడం గమనార్హం. డిఫెండింగ్ ఛాంపియన్ 56 స్కోర్ చేసి 6-0తో సెమీస్‌కు చేరుకుంది. ఇక భారత క్రీడాకారులు వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో ఏమైనా పతకాలు తెస్తారేమో చూడాలి!
శరత్ కమల్ జోరు
ఇక టేబుల్ టెన్నిస్‌లో భారత క్రీడాకారులు స్ఫూర్తిదాయక ప్రదర్శన కొనసాగిస్తున్నారు. వెటరన్ ఆటగాడు శరత్ కమల్ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. పోర్చుగీస్‌కు చెందిన టియాగో పొలొనియాను 4-2 తేడాడో ఓడించాడు. తొలి గేమ్‌లో 2-11తో వెనకబడిన అతడు రెండో గేమ్ నుంచి పుంజుకున్నాడు. వరుసగా 11-8, 11-5, 9-11, 11-6, 11-9తో విజయం సాధించాడు. మహిళల వ్యక్తిగత పోటీల్లో సుతీర్థ ముఖర్జీ కథ ముగిసింది. రెండో రౌండ్లో పోర్చుగీస్ అమ్మాయి ఫు యు చేతిలో 0-4 తేడాతో ఓడింది. సుతీర్థ ఏ దశలోనూ ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించలేదు. వరుసగా 3-11, 3-11, 5-11, 5-11 తేడాతో ఓటమి పాలైంది. శరత్ కమల్ తన తర్వాతి మ్యాచులో మా లాంగ్‌తో తలపడనున్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.