Tokyo Paralympics: 5 స్వర్ణాలు సహా 15 పతకాలు గెలిచేస్తాం!

పారాలింపిక్స్‌లో భారత్‌ 5 స్వర్ణాలు సహా 15 పతకాలు గెలుస్తుందని భారత పారాలింపిక్స్‌ కమిటీ సెక్రటరీ జనరల్‌ గరుశరణ్‌ సింగ్‌ అంచనా వేశారు. ప్రస్తుత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు....

Published : 20 Aug 2021 14:21 IST

దిల్లీ: పారాలింపిక్స్‌లో భారత్‌ 5 స్వర్ణాలు సహా 15 పతకాలు గెలుస్తుందని భారత పారాలింపిక్స్‌ కమిటీ సెక్రటరీ జనరల్‌ గరుశరణ్‌ సింగ్‌ అంచనా వేశారు. ప్రస్తుత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రియో పారాలింపిక్స్‌ తర్వాత అథ్లెట్లంతా అంతర్జాతీయ టోర్నీల్లో రాణించారని వెల్లడించారు.

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ 54 మందితో కూడిన అతిపెద్ద బృందాన్ని బరిలోకి దించుతోంది. ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, కెనోయింగ్‌, షూటింగ్‌, స్విమ్మింగ్‌, పవర్‌లిఫ్టింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, తైక్వాండోలో వీరంతా పోటీ పడనున్నారు. భారత్‌ ఇప్పటి వరకు 11 పారాలింపిక్స్‌ క్రీడల్లో 12 పతకాలే గెలవడం గమనార్హం. 

‘చరిత్రలోనే ఇవి మనకు అత్యుత్తమ పారాలింపిక్స్‌ క్రీడలు అవుతాయి. కొన్నేళ్లుగా మన అథ్లెట్లు అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటారు. పారాలింపిక్స్‌లో సత్తా చాటేందుకు వారు ఉవ్విళ్లూరుతున్నారు. ఐదు స్వర్ణాలు సహా 15 పతకాలను మేం అంచనా వేస్తున్నాం. అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, షూటింగ్‌, ఆర్చరీలో కచ్చితంగా పతకాలు వస్తాయని ధీమాగా ఉన్నాం’ అని గురుశరణ్‌ అన్నారు.

పారా హైజంప్‌ స్వర్ణపతక విజేత, భారత పతాకధారి మరియప్పన్‌ తంగవేలు మరోసారి పసిడి ముద్దాడుతాడని అంచనాలు ఉన్నాయి. ఈ మధ్యే జరిగిన జాతీయ సెలక్షన్‌ ట్రయల్స్‌లో అతడు 1.86 మీటర్లతో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ‘2017లో కాలిమడమ గాయం తర్వాత కోలుకొనేందుకు కొంత సమయం తీసుకున్నాను. సెలక్షన్‌ ట్రయల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాను. నా లయ అందుకున్నాననే అనిపిస్తోంది. స్వర్ణానికే గురిపెడతాను’ అని అతడు తెలిపాడు. దేవేంద్ర జజారియా, సుందర్‌ సింగ్‌ గుర్జర్‌, అజీత్‌ సింగ్‌, సందీప్‌ చౌదరి, నవదీప్‌ సింగ్‌, ప్రమోద్‌ భగత్‌, కృష్ణా నగర్‌, తరుణ్ దిల్లాన్‌, రాకేశ్ కుమార్‌, శ్యామ్‌ సుందర్‌, వివేక్‌ చికారా, హర్విందర్‌ సింగ్‌, జ్యోతి బలియాన్‌పై పతక ఆశలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని