Tokyo Olympics: నేటి భారతం.. ఎవరెలా ఆడారంటే?

టోక్యో ఒలింపిక్స్‌లో సోమవారం భారత క్రీడాకారుల ప్రదర్శన మోస్తరుగానే ఉంది. పతకాలు గెలిచే క్రీడల్లోనూ నిరాశ పరుస్తున్నారు. విలువిద్యలో భారత పురుషుల జట్టు కొరియా గండాన్ని దాటలేకపోయింది...

Published : 26 Jul 2021 17:41 IST

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో సోమవారం భారత క్రీడాకారుల ప్రదర్శన మోస్తరుగానే ఉంది. పతకాలు గెలిచే క్రీడల్లోనూ నిరాశ పరుస్తున్నారు. విలువిద్యలో భారత పురుషుల జట్టు కొరియా గండాన్ని దాటలేకపోయింది. పేరున్న షూటింగ్‌లోనూ ఆశావహ ఫలితాలు రాలేదు. టోక్యోలో నేటి భారత ప్రదర్శనను ఒకసారి చూద్దాం.


ఫెన్సింగ్‌లో భారత క్రీడాకారిణి భవానీ దేవి స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. తొలిరౌండ్లో ట్యునీషియా అమ్మాయి నడియా బెన్‌ అజిజిపై 15-3 తేడాతో విజయం సాధించింది. అయితే ప్రపంచ మూడో ర్యాంకర్‌, రియో సెమీఫైనలిస్టు మేనన్‌ బ్రూనెట్‌ (ఫ్రాన్స్‌)తో రెండో రౌండ్లో ఓటమి పాలైంది. 7-15తో నిష్క్రమించింది.


పురుషల ఆర్చరీ జట్టు క్వార్టర్స్‌తోనే సరిపెట్టుకుంది. అతాను దాస్‌, ప్రవీణ్‌ జాదవ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌తో కూడిన జట్టు ప్రిక్వార్టర్స్‌లో 6-2 తేడాతో కజక్‌స్థాన్‌ను ఓడించింది. అయితే కీలకమైన క్వార్టర్స్‌లో మాత్రం నిరాశపరిచింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌, బలమైన కొరియాతో 0-6 తేడాతో ఓటమి పాలైంది. ఈ పోటీలో భారత క్రీడాకారులు ఏమాత్రం పోరాట పటిమ చూపలేదు.  వరుసగా మూడు సెట్లలో పరాజయం చవిచూశారు.


షూటింగ్‌లోనూ బుధవారం నిరాశే ఎదురైంది. పురుషుల స్కీట్‌ షాట్‌గన్‌ పోటీల్లో ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేశారు. అంగద్‌వీర్‌ సింగ్‌ భజ్వా వరుసగా ఐదు రౌండ్లలో 24, 25, 24, 23, 24 స్కోరు చేశాడు. మొత్తంగా 120 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచాడు. మరో ఆటగాడు మిరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ వరుసగా 25, 24, 22, 23, 23తో మొత్తం 117 పాయింట్లే సాధించాడు. 25వ స్థానంలో నిలిచాడు. తొలి ఆరు స్థానాల్లో నిలవకపోవడంతో ఫైనల్‌కు అర్హత పొందలేదు.


సెయిలింగ్‌లో భారత క్రీడాకారులు తమ సామర్థ్యం మేరకు ఆడారు. ఏకవ్యక్తి డింఘే లేజర్‌ రేస్‌-2లో శరవణన్‌ విష్ణు 20 రేస్‌ పాయింట్లతో 20వ స్థానంలో నిలిచాడు. రేస్‌-3లో 24 పాయింట్లతో 24వ స్థానానికి పరిమితం అయ్యాడు. మహిళల రేస్‌-4లో కుమనన్‌ నేత్ర 40 రేస్‌పాయింట్లతో 40వ స్థానంలో నిలిచింది. అంతకు ముందు రేస్‌-3లో 15 పాయింట్లతో 15వ స్థానంలో నిలవడం గమనార్హం.


టేబుల్‌ టెన్నిస్‌లో వెటరన్‌ ఆటగాడు శరత్‌ కమల్‌ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. పోర్చుగీస్‌కు చెందిన టియాగో పొలొనియాను 4-2 తేడాడో ఓడించాడు. 2-11, 11-8, 11-5, 9-11, 11-6, 11-9తో విజయం సాధించాడు. మహిళల వ్యక్తిగత రెండో రౌండ్లో సుతీర్థ ముఖర్జీ పోర్చుగీస్‌ అమ్మాయి ఫు యు చేతిలో 0-4 తేడాతో ఓడింది. వరుసగా 3-11, 3-11, 5-11, 5-11 తేడాతో ఓటమి పాలైంది.  మూడో రౌండ్లో మనిక బత్రా 0-4 తేడాతో పొల్కనోవా సోఫియా (ఆస్ట్రియా) చేతిలో ఓడింది. వరుసగా 8-11, 2-11, 5-11, 7-11 స్కోర్లు మాత్రమే చేసింది.


బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ గ్రూప్‌-ఏ రెండో మ్యాచులో సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి జోడీ పరాజయం పాలైంది. ఇండోనేసియా ద్వయం, కఠిన ప్రత్యర్థి గిడేన్‌ మారక్కస్‌, కెవిన్‌ సంజయ చేతిలో 13-21, 12-21 తేడాతో వరుస గేముల్లో ఓడిపోయారు.


టెన్నిస్‌లో పురుషుల రెండో రౌండ్లో సుమిత్‌ నగాల్‌ ఓటమి పాలయ్యాడు. రష్యా ఒలింపిక్‌కమిటీ ఆటగాడు మెద్వెదేవ్‌ డేనిల్‌ 6-2, 6-2 తేడాతో వరుసగా సెట్లలో ఓడించాడు. 


బాక్సింగ్‌ పురుషుల మిడిల్‌ (69-75కిలోల) విభాగంలో ఆశీశ్‌ కుమార్‌ 0-5 తేడాతో ఓటమి చెందాడు. అతడిని ఓడించిన చైనా బాక్సర్‌ తౌహెటా ఎర్బిక్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు.


పురుషుల 200మీటర్ల బటర్‌ఫ్లై హీట్‌-2ను సాజన్‌ ప్రకాశ్‌ 1:52:22 నిమిషాల్లో పూర్తిచేసి నాలుగో స్థానంలో నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని