Vikram Rathore: చేయాల్సింది చాలానే ఉంది.. అందుకే మళ్లీ దరఖాస్తు చేశా: విక్రమ్‌

భారత క్రికెట్‌ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ పదవికి విక్రమ్‌ రాథోర్‌ మరోసారి దరఖాస్తు చేశారు. అక్టోబర్ 17న ప్రధాన కోచ్‌తో సహా...

Published : 03 Nov 2021 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత క్రికెట్‌ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ పదవికి విక్రమ్‌ రాథోడ్‌ మరోసారి దరఖాస్తు చేశారు. అక్టోబర్ 17న ప్రధాన కోచ్‌తో సహా బ్యాటింగ్‌, బౌలింగ్‌ కోచ్‌ పదవులకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రవిశాస్త్రి పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈ క్రమంలో తాను మళ్లీ బ్యాటింగ్‌ కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేసినట్లు విక్రమ్‌ వెల్లడించారు. ప్రస్తుతం బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ ఉన్నారు. ‘‘అనుభవం ఎంతో గొప్పది. అద్భుతమైన నైపుణ్యం, స్ఫూర్తివంతమైన ఆటగాళ్ల బృందంతో పని చేయడం చాలా బాగుంది. అందుకే మరోసారి బ్యాటింగ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నా. మళ్లీ ఎంపికైతే చేయాల్సిన కార్యాచరణ చాలా ఉంది’’ అని వివరించారు. బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

హెడ్‌కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునేందుకు గత నెల 26నే గడువు ముగిసింది. మిగతా పదవుల కోసం బుధవారం (నవంబర్ 3) వరకు గడువునిచ్చింది. రాహుల్‌ ద్రవిడ్‌ సహా పలువురు ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేశారు. జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాహుల్‌ ద్రవిడ్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసి.. ద్రవిడ్‌ స్థానంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ను నియమించాలని బీసీసీఐ యోచిస్తోందని సమాచారం. రాహుల్‌ను జాతీయ జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపిక  కావడం లాంఛనమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌, హెడ్‌ కోచ్ పదవులతో పాటు హెడ్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌ అండ్‌ మెడిసన్‌ పదవికీ బీసీసీఐ దరఖాస్తులను కోరింది. జట్టును ఎలా విజయవంతంగా నడుపుతారో ముఖాముఖీల్లో అభ్యర్థులు వివరించాల్సి ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని