Neeraj Chopra: వందేళ్లకు అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకం.. స్వర్ణం ముద్దాడిన నీరజ్‌

భళి..భళిరా బల్లెం వీరా! భారత యువ ఆటగాడు నీరజ్‌ చోప్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అఖండ భారతావనిని ఆనందంలో ముంచెత్తాడు. ఒకటి.. రెండు.. మూడో  కాదు ఏకంగా వందేళ్ల కలను నిజం చేశాడు...

Updated : 07 Aug 2021 20:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భళి..భళిరా బల్లెం వీరా! భారత యువ ఆటగాడు నీరజ్‌ చోప్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అఖండ భారతావనిని ఆనందంలో ముంచెత్తాడు. ఒకటి.. రెండు.. మూడో  కాదు ఏకంగా వందేళ్ల కలను నిజం చేశాడు. అథ్లెటిక్స్‌లో శతాబ్దం తర్వాత తొలి పతకం అందించాడు. జావెలిన్‌ త్రోలో స్వర్ణ పతకం ముద్దాడాడు. స్వతంత్ర భారత దేశంలో.. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్‌ బింద్రా తర్వాత పసిడి పతకం అందుకున్న వీరుడిగా నిలిచాడు.

అందరూ ఊహిస్తున్నట్టుగానే నీరజ్‌ చోప్రా అద్భుతం చేశాడు. ఈటెను విసరడంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాడు. మహామహులు.. అనుభవజ్ఞులు.. పతకాలకు ఫేవరెట్లను వెనక్కి నెట్టాడు. భారత కీర్తిపతాకను అత్యున్నత శిఖరాలలో రెపరెపలాడించేలా చేశాడు. అందరికన్నా మెరుగ్గా ఆడుతూ.. ఈటెను 87.58 మీటర్లు విసిరి నయా చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించాడు.

మొదటి అవకాశంలోనే నీరజ్‌ 87.03 మీటర్లు విసిరి ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత తన రికార్డును మరింత మెరుగు పర్చుకున్నాడు. ఈ సారి ఈటెను 87.58 మీటర్లు విసిరి పతక పోటీలో ముందుకెళ్లాడు. మూడోసారి మాత్రం 76.79కి పరిమితం అయ్యాడు. ఆ తర్వాత రెండు ఫౌల్స్‌ పడ్డాయి. ఆరో రౌండ్‌లో 84.24 మీటర్లు విసిరాడు. దీంతో పోటీలో పాల్గొన్న అథెట్లలో అత్యధిక మీటర్లు (87.58 మీటర్లు) విసిరిన ఆటగాడిగా నిలిచి స్వర్ణ పతకం ముద్దాడాడు. నీరజ్‌ తర్వాత చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకూబ్‌(86.67 మీటర్లు)కు రజతం దక్కగా, అదే దేశానికి చెందిన మరో అథ్లెట్‌ విటెడ్జ్‌స్లావ్‌(85.44 మీటర్లు)కు కాంస్యం సొంతమైంది.

ఆసియా, కామన్వెల్త్‌లో స్వర్ణ పతకాలు ముద్దాడిన నీరజ్‌ ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లోనూ అగ్ర స్థానంలో నిలిచాడు. అతడు 2021 మార్చిలో 88.07మీ, 2018, ఆసియా క్రీడల్లో 88.06మీ, 2020జనవరిలో దక్షిణాఫ్రికాలో 87.87 మీ, 2021 మార్చిలో ఫెడరేషన్‌ కప్‌లో 87.80మీ, 2018, మేలో దోహా డైమండ్‌ లీగ్‌లో 87.43 మీ, 2021 జూన్‌లో కౌరెటనె గేమ్స్‌లో 86.79మీటర్లు ఈటెను విసిరి రికార్డులు సృష్టించాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని