Tokyo olympics: ‘కంచు పట్టు’.. కాంస్యం గెలిచిన బజరంగ్‌

భారత రెజ్లర్‌ బజరంగ్‌ పునియా అద్భుతం చేశాడు. పురుషుల 65 కిలోల కుస్తీపోటీల్లో కాంస్య పతకం సాధించాడు...

Updated : 07 Aug 2021 20:05 IST

టోక్యో: భారత రెజ్లర్‌ బజరంగ్‌ పునియా అద్భుతం చేశాడు. పురుషుల 65 కిలోల కుస్తీపోటీల్లో కాంస్య పతకం సాధించాడు. ప్లేఆఫ్‌ పోటీల్లో  కజక్‌స్థాన్‌కు చెందిన దౌలత్‌ నియజ్‌బెకోవ్‌ను 8-0తో చిత్తు చేశాడు.

ఈ పోరులో బజరంగ్‌ పూర్తిగా ఆధిపత్యం చలాయించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఒకవైపు రక్షణాత్మకంగా ఆడుతూనే మరోవైపు దూకుడు ప్రదర్శించాడు. ప్రత్యర్థికి తన కాళ్లు అందకుండా జాగ్రత్తపడ్డాడు. మొదటి పీరియడ్‌లో బజరంగ్‌కు 1, 1 చొప్పున రెండు పాయింట్లు వచ్చాయి.

ఇక రెండో పీరియడ్‌లో బజరంగ్‌ దుమ్మురేపాడు. ప్రత్యర్థి కాళ్లను పట్టుకొని రింగు బయటకు నెట్టేశాడు. వరుసగా 2, 2, 2 పాయింట్లు సాధించి తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. దౌలత్‌ అతడిని పిన్‌డౌన్‌ చేసేందుకు ప్రయత్నించినా బజరంగ్‌ గట్టిగా ప్రతిఘటించాడు. 8-0 తేడాతో విజయం అందుకున్నాడు.

నిజానికి బజరంగ్‌ స్వర్ణ పతకం సాధిస్తాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఈ విభాగంలో అతడు ప్రపంచ నంబర్‌ వన్‌. అయితే సెమీస్‌లో అతడి డిఫెన్స్‌ బాగా లేదు. ఇదే అదనుగా ప్రత్యర్థి అతడి కాళ్లను ఒడిసిపట్టి ఓడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని