Updated : 17 Jul 2021 16:50 IST

కుర్రాళ్ల సమరభేరీ.. గబ్బర్‌సేన కదనోత్సాహం!

శ్రీలంక పోరుకు సిద్ధమైన టీమ్‌ఇండియా

ఇటు వైపు కొత్త ముఖాలతో కళకళాడుతున్న టీమ్‌ఇండియా. అటువైపు అనుభవజ్ఞులు లేని శ్రీలంక. ఐపీఎల్‌ అనుభవాన్ని అంతర్జాతీయ వేదికపై చాటేందుకు తపన పడుతున్న భారత కుర్రాళ్లు ఇటు. ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర పరాజయం పాలై  కరోనాతో డస్సిపోయిన లంకేయులు అటు. ఆదివారమే ఈ రెండు జట్ల మధ్య తొలి వన్డే సమరం. మరి గెలిచేదెవరు? ఎవరి పరిస్థితి ఏంటి?


పేలవ స్థితిలో లంక

సొంతగడ్డపై సిరీసులు జరుగుతున్నా ఒక్క మ్యాచైనా గెలవలేని పరిస్థితుల్లో ఉంది శ్రీలంక. ఒకప్పుడు మహామహులతో నిండిన ఆ జట్టు ఇప్పుడు బలహీనంగా మారిపోయింది. క్రమశిక్షణ కరవైంది. ఏకాగ్రత చెదిరిపోయింది. సమష్టితత్వం కొరవడింది. ఈ సిరీసుకు సారథ్యం వహిస్తున్న దసున శనక ఈ నాలుగేళ్లలో పదో సారథి. ధనంజయ డిసిల్వా, దిష్మంత చమీరా ఆడే పరిస్థితి లేదు. ఇంగ్లాండ్‌లో బుడగ వీడిన కుశాల్‌ మెండిస్‌, నిరోషన్‌ డిక్వెలా సస్పెండ్‌ అయ్యారు. మాజీ సారథి కుశాల్‌ పెరీరా గాయపడ్డాడు. కరోనా కేసులు బయటపడటంతో ఇంగ్లాండ్‌ నుంచి తిరిగి రాగానే జట్టంతా ఐసోలేషన్‌కు వెళ్లింది. అందుకే 3టీ20, 3వన్డేల్లో ఒక్కటి గెలిచినా గొప్పే అంటున్నారు విశ్లేషకులు.


4,5,6 ఎవరెవరో

మరోవైపు గబ్బర్‌ సారథ్యంలోని టీమ్‌ఇండియా ఉరకలేస్తోంది. విజయ్‌ హజారేలో పరుగుల వరద పారించిన పృథ్వీషా.. ధావన్‌తో ఓపెనింగ్‌ చేయడం ఖాయమే. హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌ ఎలాగూ ఉండేవారే. ఐతే 3, 4, 5 స్థానాల్లో ఎవరిని ఆడిస్తారనేదే తలనొప్పిగా మారింది! దేవదత్‌ పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, నితీశ్‌ రాణా ఓపెనింగే కాకుండా వన్‌డౌన్‌లోనూ రాణించగలరు. మరి ఎవరిని ఎంచుకుంటారన్నది చూడాలి. ఐపీఎల్‌ అనుభవం, ఫామ్‌ ప్రకారం చూస్తే 360 డిగ్రీల్లో ఆడే సూర్యకుమార్‌కు చోటు దక్కాలి. అతడితో మనీశ్‌ పాండే నాలుగో స్థానానికి పోటీ పడుతున్నాడు.


కిషన్‌ × సంజు

అదరగొట్టే ఆటగాళ్లు ఎక్కువ మంది ఉండటంతో కోచ్‌ ద్రవిడ్‌ జట్టుకు సమతూకం ఎలా తీసుకొస్తారనేది ఆసక్తికరం. ఎందుకంటే సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌.. ఇద్దరూ కీపింగ్‌లో మెరికలే. బ్యాటింగ్‌లోనూ దూకుడెక్కువ. అనుభవం ప్రకారం సంజుకు అవకాశం దొరకొచ్చు. వీరిద్దరూ ఐపీఎల్‌లో మూడో స్థానంలోనే వస్తుండటం గమనార్హం. ఆల్‌రౌండర్ల కోటాలో కృష్ణప్ప గౌతమ్‌, కృనాల్‌ పాండ్య పోటీ పడుతున్నారు. ఫామ్‌లో లేని యుజ్వేంద్ర చాహల్‌తో పోలిస్తే రాహుల్‌ చాహర్‌కే అవకాశాలు ఎక్కువ. కుల్‌దీప్‌ పరిస్థితీ అర్థం కావడం లేదు. పొట్టి క్రికెట్లో మిస్టరీ స్పిన్‌తో ఆకట్టుకుంటున్న వరుణ్‌ చక్రవర్తికి చోటిచ్చినా ఆశ్చర్యం లేదు.


ప్రపంచకప్‌ ప్రామాణికం

టీమ్‌ఇండియాలో అందరూ చోటుకు అర్హులే అన్నట్టుగా పోటీ పడుతున్నారు. అందుకే ఇది రెండో శ్రేణి జట్టులా కనిపించడం లేదు. ధావన్‌, షా, పాండే, సూర్య, హార్దిక్‌, కృనాల్‌, భువీ, దీపక్‌ చాహర్‌, యూజీ, కుల్‌దీప్‌కు అంతర్జాతీయ అనుభవం బాగానే ఉంది. ఐతే టీ20 ప్రపంచకప్‌ను బట్టి శ్రీలంకతో పోటీపడే జట్టు ఉంటుందని సమాచారం. ద్రవిడ్‌, ధావన్‌.. రవిశాస్త్రి, కోహ్లీతో ఈ విషయంపై చర్చించే ఉంటారని వినికిడి. ఈ సమీకరణం ప్రకారం కొత్త కుర్రాళ్లందరూ అరంగేట్రం చేయడం కష్టమే. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్ చక్రవర్తి, ఎడమచేతి వాటం పేసర్‌ చేతన్‌ సకారియా పొట్టి క్రికెట్లో అడుగుపెట్టడం ఖాయమే అనిపిస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్‌ వరకు అదరగొట్టిన కుల్చా జోడీకి శ్రీలంకలో ఎదురీత తప్పకపోవచ్చు. సారథ్యం వహిస్తున్నా టీ20 ప్రపంచకప్‌లో ధావన్‌ చోటుపై సందిగ్ధమే నెలకొనడం గమనార్హం.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని