INDvsENG: ఇంగ్లాండ్‌ పనిపట్టాలంటే.. భారత బౌలర్లకు ఆ టెక్నిక్‌ చాలు

టీమ్‌ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ సరిగా ఆడలేదని ఆ జట్టు మాజీ సారథి జియోఫ్రే బాయ్‌కాట్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు...

Published : 09 Aug 2021 23:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ సరిగా ఆడలేదని ఆ జట్టు మాజీ సారథి బాయ్‌కాట్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తొలి టెస్టులో కెప్టెన్‌ జో రూట్‌ (64, 109) మినహా మిగతా ఆటగాళ్లెవరూ పెద్ద స్కోర్లు సాధించలేదు. దాంతో వారంతా ఓపిక, నైపుణ్యంతో ఆడలేదని మండిపడ్డాడు. భారత బౌలర్లు ఊరించే బంతులేయడంతో విఫలమయ్యారని దుయ్యబట్టాడు. కొందరు బ్యాట్స్‌మెన్‌ ఆడాల్సిన బంతులు కాకపోయినా వాటిని వెంటాడి ఔటయ్యారని విమర్శించాడు.

‘నేను తాజాగా ఇంగ్లాండ్‌ కోచ్‌ గ్రాహమ్‌గూచ్‌తో అనుకోకుండా మాట్లాడా. అప్పుడు మా మధ్య ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌పై చర్చ జరిగింది. అతనేమంటాడంటే.. భారత బౌలర్లు నాలుగు బంతులు ఆడలేకుండా కట్టుదిట్టంగా వేసి ఒత్తిడి పెంచితే తర్వాత మన (ఇంగ్లాండ్‌) బ్యాట్స్‌మెన్‌ ఐదు లేదా ఆరో బంతిని దంచికొట్టాలని చూస్తారు. దాంతో వారు ఔటవ్వడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పాడు’ అని ఓ అంతర్జాతీయ పత్రికా కథనంలో పేర్కొన్నాడు. ఇప్పటి కాలంలో క్రికెట్‌ పద్ధతి మారిందని, చాలా మంది బ్యాట్స్‌మెన్‌కు షాట్లు ఆడటమే ఇష్టమని చెప్పాడు. అది కూడా వన్డే క్రికెట్‌కు తగ్గ డైట్‌ తీసుకోవడం వల్లేనని బాయ్‌కాట్‌ అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం అంతా పరిమిత ఓవర్ల క్రికెట్‌పైనే దృష్టిసారిస్తున్నారని, దాంతో టెస్టుల్లో డిఫెండింగ్‌ చేయలేకపోతున్నారని బాయ్‌కాట్‌ అన్నాడు. వన్డేల్లో, టీ20ల్లో స్ట్రైక్‌రేట్‌నే చూస్తారని, అది టెస్టుల్లో పనికిరాదని తెలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్‌ క్రికెట్‌లో డిఫెండింగ్‌ బ్యాటింగ్‌ చేయకపోతే బౌలర్లు కొత్త బంతితో ఆయా బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేసే విషయాలపై దృష్టిసారిస్తారని చెప్పాడు. దాంతో వారి బలహీనతలు కూడా తెలుస్తాయని చెప్పాడు. ఈ క్రమంలోనే బ్యాట్స్‌మెన్‌ క్రీజులో పాతుకుపోకుండా కేవలం షాట్లపైనే ఆధారపడటంలో అర్థమేముందని ఆయన ప్రశ్నించాడు. కాగా, తొలి టెస్టులో టీమ్‌ఇండియా గెలిచినంత పనిచేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 183 పరుగులకే ఆలౌటవ్వగా తర్వాత భారత్‌ 278 పరుగులు చేసింది. దాంతో 95 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులు చేయగా భారత లక్ష్యం 209 పరుగులుగా నమోదైంది. అయితే, ఐదో రోజు వర్షం కురవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 52/1తో విజయబాటలో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని