
INDvsENG: వరుణుడి దోబూచులాట.. రెండో రోజు నిలిచిన ఆట
నాటింగ్‌హామ్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట అర్ధాంతరంగా ముగిసింది. గురువారం రెండో సెషన్ జరుగుతునప్పటి నుంచీ వరుణుడు పదేపదే అడ్డంకిగా మారడంతో పలుమార్లు ఆటకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలోనే టీమ్ఇండియా రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 46.4 ఓవర్లలో 125/4 స్కోరుతో నిలిచింది. కేఎల్ రాహుల్ (57; 151 బంతుల్లో 9x4ñ), రిషభ్ పంత్(7; 8బంతుల్లో 1x4) నాటౌట్‌గా నిలిచారు. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 58 పరుగుల వెనుకంజలో నిలిచింది. అంతకుముందు టీమ్ఇండియా రెండో సెషన్లో 46.1 ఓవర్ల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. కాసేపటికే వర్షం కురవడంతో మరింత ఆలస్యమైంది. ఈ క్రమంలోనే టీమ్ఇండియా రెండో రోజు తేనీరు విరామం తీసుకుంది. అయితే, తర్వాత వర్షం కురవడం ఆగిపోయి వెలుతురు బాగా ఉండటంతో అంపైర్లు మూడో సెషన్‌ను ప్రారంభించారు. కానీ ఒక్క బంతి పడగానే మళ్లీ వర్షం కురిసింది. దాంతో రెండోసారి ఆపేశారు. కాసేపటికే వర్షం నిలిచిపోవడంతో మళ్లీ కొనసాగించారు. ఆపై అండర్సన్ మరో రెండు బంతులు వేయగానే వరుణుడు మూడోసారి అడ్డుపడటంతో మరోసారి నిలిపివేశారు. చివరికి వాతావరణం అనుకూలించకపోవడంతో అంపైర్లు రెండో రోజు ఆటను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అంతకుముందు టీమ్ఇండియా 21/0 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(36; 107 బంతుల్లో 6x4), కేఎల్ రాహుల్ తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఎలాంటి అనవసరపు షాట్లకు వెళ్లకుండా ఆచితూచి ఆడారు. ముఖ్యంగా రోహిత్ ఎంతో సహనంతో బ్యాటింగ్ చేశాడు. అయితే, భోజన విరామానికి ముందు అతడు రాబిన్సన్ బౌలింగ్‌లో ఓ భారీ షాట్ ఆడబోయి సామ్‌కరన్ చేతికి చిక్కాడు. అప్పటికి జట్టు స్కోర్ 97/1గా నమోదైంది. అదే సమయంలో టీమ్ఇండియా భోజనానికి వెళ్లింది. అయితే, ఆట తిరిగి ప్రారంభమయ్యాక అరగంటలోనే మరో మూడు వికెట్లు రాలాయి. అండర్సన్ వేసిన 41వ ఓవర్లో పుజారా (4), కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) వరుస బంతుల్లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. కాసేపటికే వైస్ కెప్టెన్ అజింక్య రహానె(5) అనవసర పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. దాంతో భారత్ 112 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై జోడీ కట్టిన రాహుల్, పంత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో రెండో రోజు ఆటను నిలిపివేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.