INDvsENG: రాహుల్‌ కళాత్మక ఇన్నింగ్స్‌.. భారీ స్కోర్‌పై కన్నేసిన భారత్‌ 

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా భారీ స్కోర్‌పై కన్నేసింది. తొలిరోజు ఆట పూర్తయ్యే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 276 పరుగులు చేసింది. తొలి టెస్టులో శతకం కోల్పోయిన కేఎల్‌ రాహుల్‌ (127; 248 బంతుల్లో 12x4, 1x6) ఈ మ్యాచ్‌లో దాన్ని అందిపుచ్చుకున్నాడు.

Updated : 13 Aug 2021 11:50 IST

రాణించిన రోహిత్‌ శర్మ, విరాట్‌కోహ్లీ..

లండన్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా భారీ స్కోర్‌పై కన్నేసింది. తొలిరోజు ఆట పూర్తయ్యే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 276 పరుగులు చేసింది. తొలి టెస్టులో శతకం కోల్పోయిన కేఎల్‌ రాహుల్‌ (127; 248 బంతుల్లో 12x4, 1x6) ఈ మ్యాచ్‌లో దాన్ని అందిపుచ్చుకున్నాడు. దాంతో ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో శతకం బాదిన మూడో భారత ఓపెనర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. మరోవైపు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(83; 145 బంతుల్లో 11x4, 1x6), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(42; 103 బంతుల్లో 3x4) రాణించడంతో భారత్‌ భారీస్కోర్‌ దిశగా సాగుతోంది. ఇక ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ రోహిత్‌, పుజారా(9)ను ఔట్‌ చేసి రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

బలమైన పునాది..

తొలుత టాస్‌ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ తొలిసెషన్‌లో నెమ్మదిగా ఆడి 46 పరుగులు చేశారు. ఈ క్రమంలోనే 18.4 ఓవర్ల వద్ద వర్షం కురవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అదే సమయంలో అంపైర్లు కాస్తముందుగా భోజన విరామం ప్రకటించారు. అప్పటికి జట్టు స్కోర్‌ 46/0గా నమోదైంది. అనంతరం వర్షం తగ్గడంతో రెండో సెషన్‌ ప్రారంభమైంది. ఈ సెషన్‌లో రోహిత్‌ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించగా, రాహుల్‌ అతడికి సహకరిస్తూ నెమ్మదిగా ఆడాడు. దాంతో రోహిత్‌ వడివడిగా పరుగులు చేస్తూ శతకం దిశగా సాగాడు. అయితే జట్టు స్కోర్‌ 126 పరుగుల వద్ద అండర్సన్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. కాసేపటికే వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ చెతేశ్వర్‌ పుజారా(9) అతడి బౌలింగ్‌లోనే స్లిప్‌లో దొరికిపోయాడు. దాంతో టీమ్‌ఇండియా 150 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. భారత్‌ 157/2తో నిలిచి రెండో సెషన్‌ పూర్తిచేసింది.

రాహుల్‌ శతకం..

ఇక మూడో సెషన్‌లో మరింత వేగంగా ఆడిన కోహ్లీ, రాహుల్‌ మూడో వికెట్‌కు శతక భాగస్వామ్యం నెలకొల్పారు. అదే సమయంలో రాహుల్‌ శతకం పూర్తిచేసుకున్నాడు. వినో మన్కడ్‌, రవిశాస్త్రి తర్వాత లార్డ్స్‌లో సెంచరీ చేసిన మూడో ఓపెనర్‌గా రాహుల్‌ ప్రత్యేకత చాటుకున్నాడు. అయితే, విరాట్‌ కోహ్లీ అర్ధశతకానికి చేరువైన వేళ రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో జోరూట్‌ చేతికి చిక్కాడు. అప్పటికి జట్టు స్కోర్‌ 267/3గా నమోదైంది. చివరికి అజింక్య రహానె(1), రాహుల్‌(127) నాటౌట్‌గా నిలిచి తొలి రోజును ముగించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని