INDvsENG: ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా కీలక ఆధిక్యం..

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టుపై 95 పరుగుల కీలక ఆధిక్యం లభించింది...

Updated : 06 Aug 2021 23:24 IST

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 278 పరుగులకు ఆలౌట్‌..
ఆదుకున్న కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా..

నాటింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టుపై 95 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. కేఎల్‌ రాహుల్‌ (84; 214 బంతుల్లో 12x4), రవీంద్ర జడేజా (56; 86 బంతుల్లో 8x4, 1x6) అర్ధశతకాలతో రాణించగా చివర్లో జస్ప్రిత్‌ బుమ్రా (28; 34 బంతుల్లో 3x4, 1x6) ధాటిగా ఆడాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో రాబిన్‌సన్‌ ఐదు వికెట్లతో చెలరేగగా అండర్సన్‌ నాలుగు వికెట్లు సాధించాడు.

శుక్రవారం 125/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్‌ఇండియా మరో 153 పరుగులు చేసి మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయింది. తొలుత మ్యాచ్‌ ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే వర్షం కురవడంతో గంట పాటు ఆట నిలిచిపోయింది. ఈ క్రమంలోనే రాహుల్‌, పంత్‌(25) నెమ్మదిగా ఆడి ఇంగ్లాండ్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అయితే, దూకుడుగా ఆడే క్రమంలో పంత్‌.. రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్‌ 145/5గా నమోదైంది. తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా చక్కటి బ్యాటింగ్‌ చేశాడు. రాహుల్‌తో కలిసి ఐదో వికెట్‌కు 60 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. రాహుల్‌, శార్ధూల్‌ ఠాకూర్‌(0) ఔటయ్యారు.

ఆపై మరింత ధాటిగా ఆడిన జడేజా అర్ధశతకం తర్వాత రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. చివర్లో మహ్మద్‌ షమి(11), బుమ్రా(28) వీలైనంత వేగంగా పరుగులు తీశారు. ముఖ్యంగా బుమ్రా బౌండరీలతో అలరించాడు. అలా టీమ్‌ఇండియా 278 పరుగులు చేసింది. అంతకుముందు రెండో రోజు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(36) ఫర్వాలేదనిపించగా పుజారా (4), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(0), వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(5) విఫలమైన సంగతి తెలిసిందే. ఇక ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీమ్‌ఇండియా దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే అత్యధిక వికెట్ల 619 రికార్డును బద్దలు కొట్టాడు. గురువారం పుజారా, కోహ్లీలను పెవిలియన్‌ చేర్చి కుంబ్లే సరసన నిలిచిన అతడు ఈరోజు శార్ధూల్‌ ఠాకూర్‌(0), రాహుల్‌ను ఔట్‌ చేసి జంబోను అధిగమించాడు. ముత్తుయ్య మురళీధరన్‌ 800 వికెట్లతో అందరికన్నా ముందుండగా షేర్న్‌వార్న్‌ 708 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అండర్సన్‌ ప్రస్తుతం 621 వికెట్లతో నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు