Kohli-Pujara: పుజారాను వదిలేయండి.. అతడే చూసుకుంటాడు

టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్‌ పుజారా బ్యాటింగ్‌పై వస్తున్న విమర్శలకు ముగింపుపలకాలని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఇంగ్లాండ్‌తో బుధవారం నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు ముందు అతడు మంగళవారం...

Published : 04 Aug 2021 01:38 IST

నాటింగ్‌హామ్‌: టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్‌ పుజారా బ్యాటింగ్‌పై వస్తున్న విమర్శలకు ముగింపు పలకాలని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సూచించాడు. ఇంగ్లాండ్‌తో బుధవారం నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు ముందు అతడు మంగళవారం మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా పుజారా బ్యాటింగ్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. పుజారాను వదిలేయాలని, అతడి లాంటి అనుభవజ్ఞులు వారంతట వారే మెరుగవుతారని అండగా నిలిచాడు.

ఈ విషయంపై చాలా రోజులుగా చర్చ నడుస్తోందని, పుజారా లాంటి అనుభవజ్ఞుడిని అలా వదిలేయాలని కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. పుజారా నైపుణ్యం కలిగిన ఆటగాడని, జట్టులో ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసని చెప్పాడు. అలాగే టీమ్‌ఇండియా జట్టులోనూ ప్రతి ఒక్కరికీ తాము ఏం చేయాలనేది స్పష్టమైన అవగాహన ఉందన్నాడు. దాంతో పుజారాపై వచ్చే విమర్శల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. అతడు కూడా ఇలాంటివి బుర్రకు ఎక్కించుకోడని కెప్టెన్‌ స్పష్టం చేశాడు.

అనంతరం టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్లపై స్పందించిన విరాట్‌.. శార్ధూల్‌ ఠాకూర్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడు బహుముఖ నైపుణ్యాలున్న క్రికెటర్‌ అని, మరిన్ని అవకాశాలొచ్చి ఆత్మవిశ్వాసం పెంచుకోగలిగితే చాలని అన్నాడు. అతడిలాంటి ఆటగాడు జట్టుకు సమతూకం తేగలడన్నాడు. మరోవైపు ఇంతకుముందు హార్దిక్‌ పాండ్య టీమ్‌ఇండియాలో ఆ పాత్రను చక్కగా నిర్వర్తించాడని, ఇప్పుడిప్పుడే తన బౌలింగ్‌తో మళ్లీ ఫామ్‌లోకి వస్తున్నాడని కెప్టెన్‌ గుర్తుచేశాడు. ఇలాంటి ఆటగాళ్లు జట్టుకు ఉపయోగపడతారని తెలిపాడు. శార్ధూల్‌ కేవలం ఈ ఒక్క సిరీస్‌కే కాదని, మున్ముందు ఇంకా కీలక ఆటగాడిగా ఎదుగుతాడని విరాట్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.మరోవైపు 2018 ఇంగ్లాండ్‌ పర్యటనలో 1-4 తేడాతో ఓటమిపాలైన టీమ్‌ఇండియా ఈసారి బాగా సన్నద్ధమైందని చెప్పాడు. అప్పుడు అనుభవం లేక సరిగ్గా ఆడలేకపోయామన్నాడు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు తమ ఆటగాళ్లు మెరుగయ్యాడని కెప్టెన్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని