IPL 2021: కోహ్లీని కెప్టెన్‌గా కలిగి ఉండటం అదృష్టం: డివిలియర్స్

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథిగా ఇన్నాళ్లూ విరాట్‌ కోహ్లీని కలిగి ఉండటం తమ అదృష్టమని ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ అన్నాడు...

Published : 12 Oct 2021 23:39 IST

(Photo: AB devilliers Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథిగా ఇన్నాళ్లూ విరాట్‌ కోహ్లీ ఉండటం తమ అదృష్టమని ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ అన్నాడు. తాజాగా ఆర్సీబీ విడుదల చేసిన బోల్డ్‌ డైరీస్‌ వీడియోలో అతడు మాట్లాడాడు. తమ జట్టులో కోహ్లీ చాలా ప్రభావం చూపాడని, అది అతడికి ఎప్పటికీ తెలియదని అన్నాడు.

‘కోహ్లీ కెప్టెన్సీలో ప్రతి సంవత్సరం నేను ఆర్సీబీ జట్టులో ఆడాను. దాంతో ఇప్పుడు అతడి గురించి ఆలోచిస్తే కృతజ్ఞత చూపించాలనే భావన కలుగుతుంది. నువ్వు ముందుండి మమ్మల్ని నడిపించడం మా అదృష్టం. నీ కెప్టెన్సీ విధానం జట్టులోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా నన్ను ఒక ఆటగాడిగా, ఒక వ్యక్తిగా చాలా ప్రభావితం చేశావు. నువ్వు ప్రభావితం చేసిన కొన్ని జీవితాల కథలు కూడా ఎప్పటికీ తెలుసుకోలేవు. నిన్ను మైదానంలోనే కాకుండా వ్యక్తిగతంగాను చాలా దగ్గరగా చూశాను. నువ్వేంటో నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇతరుల్లో నువ్వు మార్పు తీసుకొస్తావు. వాళ్లపై వాళ్లకు నమ్మకం కలిగేలా చేస్తావు. అది ఐపీఎల్‌ ట్రోఫీ సాధించడం కన్నా అతి ముఖ్యమైనది’ అని డివిలియర్స్‌ పూర్తి భావోద్వేగంతో నిండిన వ్యాఖ్యలు చేశాడు.

సోమవారం రాత్రి ఆర్సీబీ.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టు మరోసారి కప్పు సాధించాలనే కల అలాగే మిగిలిపోయింది. ఈ క్రమంలోనే కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. యూఏఈలో రెండో దశ ప్రారంభంలోనే అతడీ విషయాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇప్పుడు ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో కెప్టెన్‌గా ముగింపు పలికాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని