IPL 2021: చాహల్‌.. ఇప్పుడు కోహ్లీని అడగొచ్చు: అజయ్‌ జడేజా

రాబోయే టీ20 ప్రపంచకప్‌లో తనని ఎందుకు ఎంపిక చేయలేదని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ ఇప్పుడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని అడగొచ్చని మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా అన్నాడు...

Updated : 20 Sep 2022 15:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాబోయే టీ20 ప్రపంచకప్‌లో తనని ఎందుకు ఎంపిక చేయలేదని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ ఇప్పుడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని అడగొచ్చని మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా అన్నాడు. ఆదివారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహల్‌ మూడు కీలక వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన జడేజా తన అభిప్రాయాలు వెల్లడించాడు.

‘కీలక మ్యాచ్‌ల్లో చాహల్‌ నైపుణ్యాలు, మానసిక పరిపక్వత తెరమీదకు వస్తాయి. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఒక్క ఓవర్‌లో ఆటను మలుపుతిప్పాడు. అతడు మయాంక్‌ అగర్వాల్‌ని ఔట్ చేశాక ఇతర బ్యాట్స్‌మెన్‌పై మానసికంగా ప్రభావం చూపాడు. ఇప్పుడిక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని టీ20 ప్రపంచకప్‌ జట్టులో నుంచి తనని ఎందుకు తొలగించారని కచ్చితంగా అడగొచ్చు. ఇదివరకు అతడి ప్రదర్శన సరిగ్గా లేకపోవడంతో ఆ అవకాశం లేకపోయింది’ అని జడేజా వివరించాడు.

కాగా, చాహల్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భారత్‌లో ఆడిన తొలి దశలో ఏమాత్రం రాణించలేదు. అంతకుముందు కూడా టీమ్‌ఇండియా జట్టులో సరైన ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలోనే యూఏఈలో జరుగుతున్న రెండో దశలో కీలక వికెట్లు తీసి ఆకట్టుకుంటున్నాడు. తొలి దశలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లే తీసిన అతడు ఇప్పుడు ఐదు మ్యాచ్‌ల్లో పది వికెట్లతో దూసుకుపోతున్నాడు. ఒకవేళ మిగిలిన మ్యాచ్‌ల్లోనూ చాహల్‌ ఇలాగే రాణిస్తే టీ20 ప్రపంచకప్‌లో (అక్టోబర్‌ 15 వరకు ఆటగాళ్ల మార్పులు చేసుకునే వీలుంది) చోటు దక్కించుకునే అవకాశం లేకపోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని