IPL 2021: పంజాబ్‌ కింగ్స్‌కు అలవాటుగా మారింది.. దృష్టి సారించాలి: కుంబ్లే

ఐపీఎల్‌లో స్వల్ప తేడాలతో ఓటమిపాలవ్వడం పంజాబ్‌కు అలవాటుగా మారిందని ఆ జట్టు హెడ్‌కోచ్‌ అనిల్‌ కుంబ్లే విచారం వ్యక్తం చేశాడు. మంగళవారం రాత్రి రాజస్థాన్‌తో తలపడిన మ్యాచ్‌లో పంజాబ్‌ రెండు పరుగుల...

Updated : 22 Sep 2021 13:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌లో స్వల్ప తేడాలతో ఓటమిపాలవ్వడం పంజాబ్‌కు అలవాటుగా మారిందని ఆ జట్టు హెడ్‌కోచ్‌ అనిల్‌ కుంబ్లే విచారం వ్యక్తం చేశాడు. మంగళవారం రాత్రి రాజస్థాన్‌తో తలపడిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పంజాబ్‌ రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన కుంబ్లే ఈ ఓటమి జీర్ణించుకోలేనిదని వ్యాఖ్యానించారు.

‘ఇలా స్వల్ప తేడాలతో ఓడిపోవడం మాకు అలవాటుగా మారింది. ముఖ్యంగా ఈ దుబాయ్‌ స్డేడియానికి వచ్చేసరికి ఇలా జరుగుతోందని అనిపిస్తోంది. ఈ మ్యాచ్‌ను 19 ఓవర్లలో ముగించాలని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. అలాగే ఆడాలని నిర్ణయించుకున్నాం. కానీ, దురదృష్టవశాత్తూ మ్యాచ్‌ చివరి ఓవర్‌ వరకూ వెళ్లింది. చివర్లో కొన్ని బంతులే మిగిలి ఉండటంతో మ్యాచ్‌ గెలవడం అనేది లాటరీలా మారిపోయింది. అయితే, చివరి ఓవర్‌లో బౌలింగ్‌ చేసిన కార్తీక్‌ త్యాగిని మెచ్చుకోవాలి. అతడు ఆఫ్‌స్టంప్‌కు ఆవల బంతులేసినా మా బ్యాట్స్‌మెన్‌ ఆడలేకపోయారు. ఈ ఓటములపై దృష్టి సారించాలి. మాకింకా ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కానీ, ఇలాంటి ఫలితాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి’ అని కుంబ్లే అభిప్రాయపడ్డారు.

అనంతరం తమ బౌలింగ్‌ యూనిట్‌పై స్పందించిన పంజాబ్‌ కోచ్‌.. ఇది మంచి బ్యాటింగ్ పిచ్ అని గుర్తుచేశారు. ఒకానొక సమయంలో రాజస్థాన్‌ 200-210 పరుగులు చేసేలా కనిపించిందని, చివరి నాలుగు ఓవర్లలో తమ బౌలర్లు అద్భుతంగా బంతులేసి వారిని కట్టడి చేశారని కుంబ్లే తెలిపారు. అప్పుడు 20 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు తీశారన్నారు. అర్ష్‌దీప్‌, మహ్మద్‌ షమి, హర్‌ప్రీత్‌ బ్రార్‌లను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఇక పంజాబ్‌ ఛేదనలో 17వ ఓవర్‌ వరకూ బాగానే ఆడిందని చెప్పారు. ఈ క్రమంలోనే 18, 19 ఓవర్లలో కాస్త వెనుకబడ్డట్లు పేర్కొన్నారు. ఇక చేసేది లేక మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌ వరకూ వెళ్లడంతో అప్పుడు రెండు వికెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని