
IPL 2021: చెన్నై, పంజాబ్ పోరులో ‘కింగ్స్’ ఎవరో?
ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్ లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు మరికాసేపట్లో దుబాయ్‌లో తమ చివరి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇప్పటికే చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరగా పంజాబ్ సాంకేతికంగా నాలుగో స్థానం కోసం పోటీపడుతోంది. ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసంభవమే.. కనీసం చివరి మ్యాచ్‌లో అయినా గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు చెన్నై గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వడంతో ప్లేఆఫ్స్‌కు వెళ్లేముందు విజయం సాధించి గాడిలో పడాలని చూస్తోంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరిగే అవకాశం ఉంది.
మొత్తంగా ధోనీసేనదే ఆధిపత్యం..
ఇప్పటివరకు చెన్నై, పంజాబ్ జట్ల మధ్య మొత్తంగా 25 మ్యాచ్‌లు జరగ్గా ధోనీసేన 16 విజయాలతో ఆధిపత్యం చెలాయిస్తోంది. పంజాబ్ 9 మ్యాచ్‌లే గెలుపొంది వెనుకంజలో కొనసాగుతోంది. ఇంతకుముందు ఇదే దుబాయ్ స్టేడియంలో తలపడిన సందర్భంలోనూ చెన్నైదే పైచేయిగా కనిపిస్తోంది. గత ఐదు మ్యాచ్‌ల్లోనూ ధోనీసేన నాలుగు విజయాలతో దూకుడును కొనసాగించింది. ఇక ఈ సీజన్‌లో భారత్‌లో ఆడిన తొలి దశలోనూ చెన్నై సూపర్ కింగ్స్ విజయఢంకా మోగించింది. ఈ నేపథ్యంలో ఎలా చూసినా రాహుల్ టీమ్‌ను ధోనీసేన ఓడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
పంజాబ్‌కు ఇదొక్కటే సానుకూలం..
అందరికన్నా ముందే అధికారికంగా ప్లేఆఫ్స్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. తొలుత రాజస్థాన్ రాయల్స్ గత శనివారం ఏడు వికెట్లతో గెలుపొంది షాకివ్వగా.. సోమవారం దిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో షాకిచ్చింది. దీంతో ప్లేఆఫ్స్ చేరేముందు ధోనీసేనకు రెండు గట్టి దెబ్బలు తగిలాయి. దీంతో నేటి మ్యాచ్‌లో పంజాబ్‌కు ఏదైనా సానుకూలాంశం ఉందంటే అది ఇదొక్కటే. మరోవైపు పంజాబ్ కింగ్స్ గత రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలుపొంది మరొకటి ఓటమిపాలైంది. ఇది కూడా అటు ఇటుగానే కనిపిస్తోంది. రెండో దశలో అనూహ్యంగా ఆడుతున్న కోల్‌కతాను గత శుక్రవారం ఓడించిన రాహుల్ టీమ్ ఆదివారం బెంగళూరు చేతిలో మరోసారి విజయానికి చేరువై ఓటమిపాలైంది.
ఈ ఆటగాళ్లే కీలకం..
చెన్నై జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దిల్లీతో గత మ్యాచ్‌లో రాణించలేకపోయినా ఈ సీజన్‌లో టాప్ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా రాణిస్తున్నాడు. మరోవైపు డుప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా లాంటి ఆటగాళ్లు పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో చెన్నై బ్యాటింగ్ విభాగం ఫర్వాలేదనె చెప్పాలి. ఒకవేళ వీళ్లలో ఏ ఇద్దరు చెలరేగినా పంజాబ్‌కు కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్‌లో శార్దూల్, బ్రావో, దీపక్ చాహర్ కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతున్నారు. ఏ జట్టునైనా నిలువరించే సత్తా వీరికి ఉందనడంలో ఎలాంటి అనుమానం లేదు. మరోవైపు పంజాబ్ జట్టులో ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మినహా బ్యాటింగ్‌లో ఎవరూ రాణించడం లేదు. బౌలింగ్‌లో షమి, అర్ష్‌దీప్ సింగ్, రవిబిష్ణోయ్ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. దీంతో రెండు జట్లను పూర్తిగా పరిశీలిస్తే చెన్నై టీమే బలంగా కనిపిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.