IPL 2021: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక నిర్ణయం.. వార్నర్‌కు ఉద్వాసన?

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మిగతా సీజన్‌లో ఆ జట్టు మాజీ సారథి డేవిడ్‌ వార్నర్‌ను ఆడించే అవకాశం లేదని తెలుస్తోంది. అతడికి బదులు యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు సన్‌రైజర్స్‌...

Published : 28 Sep 2021 16:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా సీజన్‌లో ఆ జట్టు మాజీ సారథి డేవిడ్‌ వార్నర్‌ను ఆడించే అవకాశం లేదని సమాచారం. అతడికి బదులు యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు సన్‌రైజర్స్‌ కోచ్‌ ట్రెవర్‌ బైలిస్‌ తాజాగా వెల్లడించాడు. ఓపెనర్‌గా ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌.. 107.73 స్ట్రైక్‌రేట్‌తో 195 పరుగులే చేశాడు. సోమవారం రాత్రి రాజస్థాన్‌తో తలపడిన మ్యాచ్‌లో జట్టు యాజమాన్యం అతడిని రెండోసారి పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో వార్నర్‌ స్థానంలో బరిలోకి దిగిన జేసన్‌ రాయ్‌ 60 పరుగులతో చెలరేగి ఆకట్టుకున్నాడు.

రాజస్థాన్‌పై విజయం సాధించాక ట్రెవర్‌ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో వార్నర్‌ ఒక్కడినే పక్కన పెట్టలేదని, కేదార్‌ జాధవ్‌, షాబాజ్‌ నదీమ్‌ లాంటి ఆటగాళ్లను కూడా రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేశామని చెప్పాడు. ‘మేం ఎలాగూ ఫైనల్స్‌కు వెళ్లలేం. అలాంటప్పుడు యువ ఆటగాళ్లకు అవకాశాలిచ్చి చూడాలని అనుకున్నాం. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్‌తో మ్యాచ్‌లో వార్నర్‌ను తప్పించాం. అలాగే మా జట్టులో బరిలోకి దిగని ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. రిజర్వ్‌బెంచ్‌లోని ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. వాళ్లకు అవకాశాలిచ్చి చూడాలనుకున్నాం. మిగిలిన మ్యాచ్‌ల్లోనూ ఇదే కొనసాగుతుందని అనుకుంటున్నా. అయితే, దీనిపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు’ అని సన్‌రైజర్స్‌ కోచ్‌ వివరించాడు.

మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దంచికొట్టిన జేసన్‌ రాయ్‌ మాట్లాడుతూ సన్‌రైజర్స్‌ ఇకపై మిగిలిన మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. పాయింట్ల పట్టికలో వీలైనంత పైకి ఎగబాకి గర్వంగా తల ఎత్తుకొని బయటకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇక తన ప్రదర్శనపై స్పందిస్తూ.. ఈ విజయం తనకు సంతోషం కలిగించిందని.. తనకు అవకాశం ఇచ్చిన జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సీజన్‌లో తమ జట్టు విఫలమైనా.. ఆ పరిస్థితులను దాటి ఇలా రాణించడం గొప్పగా ఉందన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు