
IPL 2021: మేం ఏం చేయాలనేదానిపై దృష్టి సారించాలి: ధోనీ
ఇంటర్నెట్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశను పూర్తి చేసుకుంది. గురువారం పంజాబ్ చేతిలోనూ ఓటమిపాలై రెండో స్థానంలో ప్లేఆఫ్స్‌కు చేరింది. అయితే, ఇప్పుడు వరుసగా మూడు మ్యాచ్‌లు ఓటమిపాలవ్వడమే ఆ జట్టును కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ వాస్తవాలను అర్థం చేసుకొని మెలగాలని చెప్పాడు.
‘ఈ ఓటములను స్వీకరించి ముందుకు సాగాలి. అది మానసికంగా అయినా లేదా నైపుణ్యాల పరంగానైనా అర్థం చేసుకొని వెళ్లాలి. మేం ప్లేఆఫ్స్ చేరడానికి బాగా కష్టపడ్డాం. అయితే, ఈ రెండు మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాం. అందులో ఒకటి గెలుస్తామనుకున్నా కుదరలేదు. ఇలాంటి లీగుల్లో ఇవన్నీ సహజమే. ఏదైమైనా మనం విజయం సాధించాలంటే అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. అయితే, మా ఓటములకు పట్టుదల లేకపోవడం అనేది కారణం కాదు. మా ఆటగాళ్లంతా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మేం ఏం చేయాలనేదానిపై కాస్త దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. మరోవైపు కొన్నిసార్లు టాస్ కూడా మాకు కలిసిరాలేదు. ఇది కాస్త కఠినమైన పిచ్. కానీ మొత్తంగా చూస్తే ఫర్వాలేదని చెప్పొచ్చు’ అని ధోనీ వివరించాడు.
ఇలాగే పెరిగాను.. ఇలాగే ఆడతా: రాహుల్
ఇక మ్యాచ్ గెలిచాక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ తాము 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేయాలనుకున్నట్లు చెప్పాడు. అందువల్లే తాను ఆది నుంచే భారీ షాట్లు ఆడాలనుకున్నట్లు తెలిపాడు. ‘ఈరోజు మా ప్రణాళిక చాలా సింపుల్. ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లలోనే పూర్తి చేస్తే మంచి అవకాశాలున్నాయని చెప్పారు. దీంతో నేను తొలి బంతి నుంచే ధాటిగా ఆడాలని నిర్ణయించుకున్నా. ఇక నా బ్యాటింగ్‌లో ఫేవరెట్ షాట్ అంటే హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్క్వేర్‌లెగ్ మీదుగా కొట్టిన సిక్సర్. అలాంటి పుల్‌షాట్ ఆడాలంటే నాకెంతో ఇష్టం. ఇక నా బ్యాటింగ్ గురించి మాట్లాడితే జట్టుకు అవసరమైన రీతిలోనే ఆడాలనుకుంటా. గత మూడు నాలుగేళ్లుగా నా బ్యాటింగ్‌పై అనేక మాటలు వినిపిస్తున్నాయి. అయితే, నేనెలా ఆడుతున్నాననేది నాకు, మా ఫ్రాంఛైజీకి తెలుసు. జట్టుకు అవసరమైన రీతిలోనే నేను బ్యాటింగ్ చేస్తా. నాకెప్పుడూ జట్టే మొదటి ప్రాధాన్యం. నేను ఇలాగే పెరిగాను. ఇలాగే ఆడతాను. ఈరోజు జట్టుకు అవసరమైన రీతిలో ఆడినందుకు సంతోషంగా ఉంది’ అని రాహుల్ వివరించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.