IPL 2021 Final: నా దృష్టిలో కోల్‌కతానే విజేత: ధోనీ

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నాలుగోసారి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. శుక్రవారం రాత్రి దుబాయ్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడిన మ్యాచ్‌లో ధోనీసేన 27 పరుగులతో విజయం సాధించింది...

Updated : 16 Oct 2021 13:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నాలుగోసారి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. శుక్రవారం రాత్రి దుబాయ్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడిన మ్యాచ్‌లో ధోనీసేన 27 పరుగులతో విజయం సాధించింది. దీంతో ముంబయి ఇండియన్స్‌ (5) తర్వాత అత్యధిక సార్లు టైటిల్‌ సాధించిన జట్టుగా చెన్నై మరో అడుగు ముందుకేసింది. ఈ క్రమంలోనే మ్యాచ్‌ అనంతరం ధోనీ మాట్లాడాడు. ఈ సీజన్‌లో అసలైన విజేత కోల్‌కతా అని అభిప్రాయపడ్డాడు. కరోనా వల్ల ఈ టోర్నీ రెండు భాగాలుగా జరగడం మోర్గాన్‌ టీమ్‌కు కలిసొచ్చిందని చెప్పాడు.

‘నేను ఇప్పుడు చెన్నై గురించి మాట్లాడే ముందు కోల్‌కతా గురించి చెప్పాలి. భారత్‌లో తొలి అంచె తర్వాత ఆ జట్టు ఇంత గొప్పగా పుంజుకోవడం చాలా కష్టమైన పని. ఈ సీజన్‌లో ఎవరైనా విజేతగా నిలవాలంటే అది కోల్‌కతానే. వాళ్లకు మధ్యలో దొరికిన విరామం కలిసి వచ్చిందని అనుకుంటున్నా. ఇక చెన్నై గురించి మాట్లాడితే మా జట్టులో పలువురి ఆటగాళ్లను సందర్భానుసారం మార్చాల్సి వచ్చింది. ప్రతి మ్యాచ్‌ తర్వాత మాకు సరైన మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారనిపించింది. ఇక ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్నారు. ఇన్నిసార్లు ఫైనల్‌కు చేరడం ఎంతో ప్రత్యేకం. అయితే, మేం ఎంత నిలకడైన జట్టు అయినా గతంలో ఫైనల్స్‌లోనూ ఓటమిపాలయ్యాం. ప్రత్యర్థులు మాపై ఆధిపత్యం చెలాయించొద్దనే మేం భావిస్తాం. అలాగే జట్టు విజయాలు సాధించడానికి మేం పెద్దగా చర్చలు జరుపుకోము. మా ఆటగాళ్లు ఆటతీరు బాగుంది. సరైన ప్లేయర్లు లేకపోతే ఇలా విజయాలు సాధించడం కష్టం. చివరగా మా అభిమానులకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. మేం ఎక్కడ ఆడినా ఎంతగానో మద్దతిస్తారు. వాళ్లందరికీ ధన్యవాదాలు’ అని చెన్నై సారథి స్పందించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (32; 27 బంతుల్లో 3x4, 1x6), డుప్లెసిస్‌ (86; 59 బంతుల్లో 7x4, 3x6) శుభారంభం అందించారు. అనంతరం గైక్వాడ్‌ ఔటైనా ఉతప్ప(31; 15 బంతుల్లో 3x6), మొయిన్‌ అలీ (37; 20 బంతుల్లో 2x4, 3x6) దంచికొట్టారు. ఇక ఛేదనలో కోల్‌కతా ఓపెనర్లు శుభ్‌మన్‌గిల్‌ (51; 43 బంతుల్లో 6x4), వెంకటేశ్‌ అయ్యర్‌ (50; 32 బంతుల్లో 5x4, 3x6) అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించి సగం పని పూర్తి చేసినా తర్వాత వచ్చిన బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. చివర్లో శివమ్‌ మావి (20; 13 బంతుల్లో 1x4, 2x6), లాకీ ఫెర్గూసన్‌ (18; 11 బంతుల్లో 1x4, 1x6) ధాటిగా ఆడినా అప్పటికే సమయం మించిపోయింది. దీంతో కోల్‌కతా 165/9 స్కోరుకే పరిమితమైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని