IPL 2021: సోషల్‌ మీడియాలో చెత్తవాగుడు వాగకండి: మాక్స్‌వెల్ సీరియస్‌

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మరోసారి విఫలమవ్వడంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోలింగ్‌ను చూసి ఆ జట్టు ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు...

Updated : 12 Oct 2021 12:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మరోసారి విఫలమవ్వడంపై సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న ట్రోలింగ్‌ను చూసి ఆ జట్టు ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. నెటిజెన్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మర్యాదగా ప్రవర్తించాలని సూచించాడు. సోమవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరు .. కోల్‌కతా చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోహ్లీసేనను ఉద్దేశిస్తూ పలువురు నెటిజెన్లు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీంతో మాక్సీ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ ఒక పోస్టు పెట్టాడు.

‘ఈ సీజన్‌లో మేం బాగా ఆడినా దురదృష్టంకొద్దీ కీలక మ్యాచ్‌లో ఓడిపోయాం. అనుకున్నదానికి చేరువగా వచ్చి త్రుటిలో అవకాశాన్ని కోల్పోయాం. ఇదో గొప్ప సీజన్‌. అయితే, సామాజిక మాధ్యమాల్లో చెత్తవాగుడు తీవ్రంగా కలచివేసింది. మేం కూడా మనుషులమే. ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికే ప్రయత్నిస్తాం. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. మర్యాదగా ప్రవర్తించండి. అలాగే మాకు అండగా నిలిచి ఎల్లవేళలా ప్రేమాభిమానాలు కురిపించిన నిజమైన ఆర్సీబీ అభిమానులకు ధన్యవాదాలు. కానీ, కొంత మంది సామాజిక మాధ్యమాలను అసహ్యంగా మారుస్తున్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. మీరూ వాళ్లలా ఉండకండి’ అని మాక్స్‌వెల్‌ వాపోయాడు.

గతేడాది పంజాబ్‌ తరఫున ఆడిన మాక్స్‌వెల్‌ 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులే చేసి పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఈసారి వేలంలో భారీ ధర వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. ఆ జట్టు నమ్మకాన్ని నిలబెడుతూ మాక్స్‌వెల్‌ ఈ సీజన్‌లో రెచ్చిపోయాడు. ఆడిన 15 మ్యాచ్‌ల్లో ఆరు అర్ధశతకాలతో 513 పరుగులు సాధించి ఆర్సీబీ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ నమోదు చేశాడు. అలాగే టాప్‌ బ్యాట్స్‌మెన్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. అంత బాగా ఆడిన ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కోల్‌కతాతో జరిగిన కీలకపోరులో విఫలమయ్యాడు. 15 పరుగులే చేసి నిరాశపర్చాడు. మరోవైపు ఇతర బ్యాట్స్‌మెన్‌ కూడా పరుగులు చేయలేకపోవడంతో ఆర్సీబీ 138/7 తక్కువ స్కోరే సాధించింది. అనంతరం కోల్‌కతా ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల్లో ఆర్సీబీపై, మాక్స్‌వెల్‌పై విమర్శలు వచ్చాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని