Inzamam Ul Haq: ఇంజమామ్‌ ఉల్‌ హక్‌కు గుండెపోటు.. 

పాకిస్థాన్‌ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ (51) గుండెపోటుకు గురయ్యారు. సోమవారం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో లాహోర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు...

Updated : 28 Sep 2021 10:10 IST

లాహోర్‌: పాక్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ (51) గుండెపోటుకు గురయ్యారు. సోమవారం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో లాహోర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. గత మూడు రోజులుగా ఛాతి నొప్పితో ఆయన బాధపడుతున్నారు. అయితే, సోమవారం నొప్పి తీవ్రమవడంతో వైద్యులు గుండె పోటుగా నిర్ధారించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇంజమామ్‌ పాకిస్థాన్‌ జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సేవలందించారు. 1991లో అరంగేట్రం చేసిన ఆయన 2007 వరకు క్రికెటర్‌గా కొనసాగారు. 1992 వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన పాక్‌ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నారు. తర్వాత కీలక ఆటగాడిగా మారి జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. ఈ క్రమంలోనే 2001 నుంచి 2007 వరకు ఆ జట్టు సారథిగా బాధ్యతలు నిర్వర్తించారు. మొత్తం 375 వన్డేలు ఆడిన ఇంజమామ్‌ పాకిస్థాన్‌ తరఫున అత్యధిక పరుగులు 11,701 చేసిన ఆటగాడిగా నిలిచారు. ఇక 119 టెస్టుల్లోనూ 8,829 పరుగులు చేశారు. చివరగా 2016 నుంచి 2019 వరకు పాక్‌ క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌గా సేవలందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని