
IPL 2021: డీజే బ్రావో నుంచి నేర్చుకోవడం బాగుంది: హేజిల్‌వుడ్
ఇంటర్నెట్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డీజే బ్రావో నుంచి పలు విషయాలు నేర్చుకోవడం బాగుందని ఆ జట్టు పేసర్ జోష్ హేజిల్‌వుడ్ అన్నాడు. గురువారం రాత్రి సన్‌రైజర్స్‌తో తలపడిన సందర్భంగా అతడు మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై మాట్లాడిన చెన్నై పేసర్.. తన సహచరుడు బ్రావోకు ఆ క్రెడిట్ దక్కుతుందని చెప్పాడు.
‘ప్రతి మ్యాచ్ కోసం నేనెంతో కష్టపడి అనేక విషయాలు నేర్చుకుంటా. ఇక ఈ మ్యాచ్‌లో ఆదిలోనే జేసన్ రాయ్‌ను ఔట్ చేయడం సంతోషాన్ని కలిగించింది. అది చాలా పెద్ద వికెట్. దీంతో ఆరంభం నుంచే సన్‌రైజర్స్‌పై ఒత్తిడి తీసుకువచ్చాం. ఈ షార్జా వికెట్ కాస్త నెమ్మదిగా ఉన్నా బౌలింగ్‌కు సహకరించింది. అలాగే మేం ప్రాక్టీస్‌లో ఏదైతే సాధన చేస్తున్నామో అదే మ్యాచ్‌లో అమలు చేస్తున్నాం. ఇక ఈ సీజన్లో నేను కొద్ది రోజులుగా బ్రావోతో కలిసి పనిచేస్తున్నాను. అతడి వద్ద నుంచి పలు విషయాలు నేర్చుకోవడం ఆనందంగా ఉంది. నేను మరిన్ని నేర్చుకోవడానికి ఈ ఐపీఎల్ ఎంతో ఉపయోగపడుతోంది’ అని హేజిల్‌వుడ్ వివరించాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 134/7 స్కోర్ సాధించింది. హేజిల్‌వుడ్.. ప్రధాన వికెట్ రాయ్(2)తో పాటు అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్‌లను పెవిలియన్ పంపాడు. మరో ఎండ్‌లో బ్రావో సైతం రెండు వికెట్లతో చెలరేగాడు. దీంతో వీరిద్దరూ సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి ఆ జట్టు భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. అనంతరం చెన్నై 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ ధోనీ (14*) చివర్లో సిక్సర్ బాది జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలోనే చెన్నై ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్లో సన్‌రైజర్స్‌పై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా ధోనీసేన నిలిచింది.
ఇవీ చదవండి
Advertisement