IPL 2021: ఆదిలోనే వికెట్లు కోల్పోకుంటే మరోలా ఆడేవాళ్లమేమో: విలియమ్సన్

దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆదిలోనే వికెట్లు కోల్పోకుంటే మరోలా ఆడేవాళ్లమని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు...

Published : 23 Sep 2021 08:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆదిలోనే వికెట్లు కోల్పోకుంటే మరోలా ఆడేవాళ్లమని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. ఐపీఎల్‌ రెండో దశలో బుధవారం రాత్రి తొలి మ్యాచ్‌ ఆడిన సన్‌రైజర్స్‌ మరోసారి పేలవ ఆటతీరు ప్రదర్శించింది. మరీ ముఖ్యంగా బ్యాటింగ్‌లో తడబడి 134/9 స్కోరే చేసింది. అనంతరం దిల్లీ క్యాపిటల్స్‌ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

‘మేం శుభారంభం చేయలేకపోయాం. మంచి భాగస్వామ్యాలు నిర్మించలేకపోయాం. సానుకూలంగా ఆడే అవకాశాలు కూడా దక్కలేదు. చివర్లో ఫర్వాలేదనిపించినా ఇంకో 25-30 పరుగులు తక్కువే చేశాం. మా బౌలింగ్‌ అయితే బాగా ఉంది. గతంలో మోస్తరు లక్ష్యాలను కాపాడుకున్న అనుభవం మాకుంది. అయితే, ఈరోజు అది కుదరలేదు. సిగ్గుగా ఉంది కానీ.. ఆటను ఆస్వాదించాలి. ఒత్తిడికి లోనుకావొద్దు. మరోవైపు దిల్లీ క్యాపిటల్స్‌ అద్భుతంగా ఆడింది. ఆ జట్టులో ఇద్దరు నాణ్యమైన ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు. మాపై ఆధిపత్యం చెలాయించారు. మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. ఒకవేళ మేం ఆదిలోనే వికెట్లు కోల్పోకపోయి ఉంటే మరోలా ఆడేవాళ్లం. మా ఆటలోని లోపాలపై దృష్టిసారించి మెరుగవ్వాలి’ అని విలియమ్సన్‌ అన్నాడు.

దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌పంత్‌ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్‌ తొలి దశలో బాగా ఆడాం.. ఇప్పుడు రెండో దశను కూడా విజయంతో ప్రారంభించడం సంతోషంగా ఉంది. మా ప్రణాళికలపై దృష్టిసారించి వాటికోసం వంద శాతం కష్టపడాలని అనుకున్నాం. మా బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. ప్రపంచంలోనే మేటి బౌలర్లను కలిగి ఉండటం వరంగా భావిస్తున్నా. సన్‌రైజర్స్‌ను 150-160 లోపు కట్టడి చేస్తే సరిపోతుందని అనుకున్నాం కానీ, 130కే పరిమితం చేయడం ఇంకా మంచిదనిపించింది’ అని పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని