IPL 2021: మేం గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకోలేదు: కేఎల్‌ రాహుల్‌

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రెండు పరుగుల తేడాతో ఓటమిపాలవ్వడం జీర్ణించుకోలేని విషయమని పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు...

Published : 22 Sep 2021 08:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రెండు పరుగుల తేడాతో ఓటమిపాలవ్వడం జీర్ణించుకోలేని విషయమని పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. ఇంతకుముందు కూడా తమ జట్టు ఇలాంటి ఓటములు చూసిందని చెప్పాడు. గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ సునాయాస విజయం సాధించే అవకాశం ఉన్నా ఆఖరి ఓవర్‌లో రాజస్థాన్‌ బౌలర్‌ కార్తీక్‌ త్యాగి అద్భుతం చేసిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్లో 8 వికెట్లు చేతిలో ఉండి, సాధించాల్సిన పరుగులు నాలుగే అయినా రాహుల్‌ టీమ్‌ అనూహ్య ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలోనే అతడీ వ్యాఖ్యలు చేశాడు.

తప్పుల నుంచి నేర్చుకోలే..: రాహుల్‌

(Photo: KL Rahul Twitter)

‘ఈ ఓటమిని స్వీకరించడం చాలా కష్టం. ఇదివరకు కూడా మా జట్టు ఇలాంటి అనుభవాలు చవిచూసింది. మేం ఒత్తిడిని ఎలా జయించగలమో చూడాలి. అయితే, మేం గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకోలేదని అనిపిస్తోంది. ఇకపై బలంగా పుంజుకొని మిగతా ఐదు మ్యాచ్‌లు గెలిచేందుకు ప్రయత్నిస్తాం. మేం బంతితో మంచి ప్రదర్శన చేశాం. అవసరమైన సమయాల్లో వికెట్లు తీశాం. ఇక మా బ్యాటింగ్‌లో నేనూ మయాంక్‌, మార్‌క్రమ్‌ పరుగులు చేయడం చాలా ముఖ్యమైన విషయం. కొన్నిసార్లు ముందుగానే మ్యాచ్‌ను ముగించాలని ప్రయత్నిస్తే అది ప్రత్యర్థులకు కలిసివచ్చే ప్రమాదం ఉంటుంది’ అని పంజాబ్‌ కెప్టెన్‌ పేర్కొన్నాడు.

గెలుస్తామనే నమ్మకంతోనే ఉన్నాం: సంజూ

(Photo: Sanju Samson Twitter)

‘మేం ఈ మ్యాచ్‌లో గెలుస్తామనే నమ్మకంతోనే ఉన్నాం. గేమ్‌ ప్లాన్‌లో భాగంగానే ముస్తాఫిజుర్‌, కార్తీక్‌ త్యాగి బౌలింగ్‌ను ఆఖరి వరకూ వినియోగించలేదు. క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చనే నమ్మకంతో ఉన్నా. ఆత్మవిశ్వాసంతోనే పోరాడాం. నేనెప్పుడూ మా బౌలర్లపై పూర్తి భరోసా ఉంచుతా. చివరి వరకూ పోరాడాలనే కసితోనే వారిద్దరికి ఆఖర్లో బంతి ఇచ్చాను. మరోవైపు ఈ వికెట్‌పై 185 పరుగులు చేయడం అనేది మాకు సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే ఆ స్కోరును కాపాడగలిగే బౌలింగ్‌ యూనిట్‌ మాకు ఉందనిపించింది. అయితే, మేం కొన్ని మ్యాచ్‌లు జారవిడవకుండా ఉండి ఉంటే కాస్త ముందుగానే మ్యాచ్‌ గెలిచేవాళ్లం’ అని సంజూ శాంసన్‌ చెప్పాడు.

అప్పుడు చాలా బాధేసింది: కార్తీక్‌ త్యాగి

(Photo: Kartik Tyagi Twitter)

‘భారత్‌లో ఐపీఎల్‌ జరిగేటప్పుడు నేను గాయపడ్డా. తిరిగి కోలుకునేసరికి టోర్నీ వాయిదా పడింది. దాంతో చాలా బాధపడ్డా. ఇప్పుడీ ప్రదర్శన సంతోషం కలిగించింది. టీ20 క్రికెట్‌ గురించి చాలా ఏళ్లుగా అనేక మందితో మాట్లాడేవాడిని. వాళ్లంతా ఈ ఆటలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతాయని చెప్పేవారు. దీంతో వారిని నమ్మాల్సి వచ్చింది. అలాగే పొట్టి క్రికెట్‌లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చనే నమ్మకం కలిగింది. అలాంటి మ్యాచ్‌లెన్నో చూశాను. ఇక నేను ఈ మ్యాచ్‌లో ఇలాంటి అత్యద్భుత ప్రదర్శన చేయడం చాలా ఆనందంగా  ఉంది. ఇంతకుముందు నా బౌలింగ్‌లో చిన్న సమస్య ఉండేది. దానిపై సరైన ఫీడ్‌బ్యాక్‌ తీసుకొని తర్వాత దృష్టిసారించా. అలా నా బౌలింగ్‌ను మెరుగుపర్చుకున్నా’ అని ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన కార్తీక్‌ త్యాగి వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని