IPL 2021: కోహ్లీ నిర్ణయం ప్రభావం చూపలేదు.. మా ఓటమికి వేరే కారణం: మైక్‌ హెసన్‌

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఆడిన మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నిర్ణయం ప్రభావం చూపలేదని ఆ జట్టు హెడ్‌కోచ్‌ మైక్‌ హెసన్‌ వివరించాడు...

Published : 22 Sep 2021 02:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఆడిన మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నిర్ణయం ప్రభావం చూపలేదని ఆ జట్టు హెడ్‌కోచ్‌ మైక్‌ హెసన్‌ వివరించాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో దశ ప్రారంభానికి ముందు కోహ్లీ ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి టోర్నీ ముగిశాక తప్పుకుంటున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, అతడిప్పుడే ఆ నిర్ణయం ప్రకటించడం వల్ల బెంగళూరు ఆటగాళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే వార్తలు వినిపించాయి. అనుకున్నట్లే సోమవారం రాత్రి కోల్‌కతాతో జరిగిన పోరులో ఆ జట్టు 92 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవం పాలైంది. ఈ నేపథ్యంలోనే హెసన్‌ మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ కోహ్లీ నిర్ణయం తమపై ప్రభావం చూపలేదన్నాడు.

‘కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని వీలైనంత త్వరగా బయటకు చెప్పాలని ముందే అనుకున్నాం. ఈ విషయం గురించి ప్రతి ఒక్క ఆటగాడికి తెలుసు. అయితే, కేకేఆర్‌తో ఆడిన మ్యాచ్‌లో ఆ నిర్ణయం ప్రభావం చూపలేదు. బ్యాటింగ్‌లో మేం సరిగ్గా ఆడకపోవడమే కారణం. చాలా త్వరగా వికెట్లు కోల్పోయాం. కానీ, మా జట్టు అంతే వేగంగా ఓటముల నుంచి పుంజుకుంటుందనే నమ్మకం ఉంది. ఈరోజు జట్టు కూర్పులో ఎలాంటి సమస్య లేదు. నిజం చెప్పాలంటే మేం టాస్‌ను తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇది కేవలం 93 పరుగులు చేసే పిచ్‌ కాదు. కనీసం 150 పరుగులు చేయాల్సింది. ఆ స్కోర్‌ కూడా సరిపోతుందా లేదా అనేది ప్రశ్నార్ధకమే’ అని హెసన్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని