Published : 02 Oct 2021 13:18 IST

IPL 2021: దిల్లీ పుంజుకోవడానికి ఇదే అవకాశం.. ముంబయికి కీలక పోరు

ఇంటర్నెట్‌డెస్క్‌: యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ రెండో దశలో వరుస విజయాలతో దూసుకుపోయిన దిల్లీ క్యాపిటల్స్‌ గత మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో అనూహ్యంగా కంగుతింది. ఇప్పుడా జట్టు ముంబయి ఇండియన్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తోంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించిన దిల్లీ ప్లేఆఫ్స్‌ రేసులో రెండో స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి చెన్నైతో సమానంగా నిలవాలని చూస్తోంది.

గత మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం సాధించిన ముంబయి ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది పాయింట్ల పట్టికలో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి ముందుకు సాగాలని ఆలోచిస్తోంది. ఈ రోజు మ్యాచ్‌ గెలిస్తే.. తనతో పాటు 10 పాయింట్లతో సమానంగా ఉన్న పంజాబ్‌, కోల్‌కతాను అధిగమించాలని భావిస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. కాగా, గత మ్యాచ్‌లో దిల్లీ బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. కోల్‌కతా స్పిన్నర్ల ధాటికి 127/9 స్కోరుకే పరిమితమయ్యారు. గాయం కారణంగా పృథ్వీషా ఆడని పక్షంలో స్టీవ్‌స్మిత్‌ (39) బరిలోకి దిగి ఆదుకున్నాడు. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (39) సైతం తనవంతు పరుగులు చేశాడు. అయితే, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా చేతులెత్తేయడమే ఆ జట్టు ఓటమికి కారణమైంది.

పరిస్థితులు మారొచ్చా?

గత మ్యాచ్‌లో ఆడని పృథ్వీ ఈరోజు బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. దీంతో దిల్లీ జట్టులో మళ్లీ పరుగుల వరద పారే అవకాశం ఉంది. అతడికి తోడుగా శిఖర్‌ ధావన్‌ ఉన్నాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లో గబ్బర్‌ ఒకడిగా కొనసాగుతున్నాడు. మరోవైపు రెండో దశలో జట్టులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌, తర్వాత వచ్చే కెప్టెన్‌ పంత్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. దీంతో వీళ్లంతా చెలరేగితే ముంబయికి కష్టాలు తప్పకపోవచ్చు. ఇక బౌలింగ్‌లో దిల్లీ పటిష్ఠంగా కనిపిస్తోంది. రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, లలిత్‌ యాదవ్‌ స్పిన్‌ బౌలింగ్‌కు తోడు రబాడ, అవేశ్‌ ఖాన్‌, నోర్జేలతో పేస్‌ బౌలర్లు కూడా సిద్ధంగా ఉన్నారు.

ముంబయి కట్టడి చేస్తుందా?

మరోవైపు ముంబయి జట్టుకు బ్యాటింగే ప్రధాన సమస్యగా మారింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, క్వింటన్‌ డికాక్‌ ఫర్వాలేదనిపిస్తున్నా భారీ ఇన్నింగ్స్‌ ఆడటం లేదు. తర్వాత వచ్చే సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, కృనాల్‌ పాండ్య పరుగులు చేయలేక పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, గత మ్యాచ్‌లో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ సౌరభ్‌ తివారి (45), హార్దిక్‌ పాండ్య(40) రాణించడం ఆ జట్టుకు కాస్త ఉపశమనం కలిగించింది. దీంతో నేటి మ్యాచ్‌లోనూ వీరిద్దరూ కీలకంగా మారనున్నారు. మ్యాచ్‌ ఫినిషర్‌గా మంచి పేరున్న కీరన్‌ పొలార్డ్‌ గత మ్యాచ్‌లో లయ అందుకున్నట్లు కనిపించాడు. బౌలింగ్‌లో బుమ్రా రాణిస్తున్నా అతడికి సరైన జోడీ కరవైనట్లు అనిపిస్తోంది. ఆడం మిల్నే, ట్రెంట్‌ బౌల్ట్‌ తమ బౌలింగ్‌కు పదును పెట్టాల్సి ఉంది. చివరగా కృనాల్‌, రాహుల్‌ చాహర్‌ యూఏఈలో వికెట్లు తీయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి జట్టు దిల్లీని ఏ మేరకు కట్టడి చేస్తుందో చూడాలి.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని