IPL 2021 - Mumbai Indians: అప్పుడప్పుడు ఇలాంటి ఓటములు ఎదురవుతాయి : రోహిత్

అప్పుడప్పుడు ఇలాంటి ఓటములు ఎదురవుతాయని ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. గురువారం రాత్రి కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ చిత్తుగా...

Published : 24 Sep 2021 09:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అప్పుడప్పుడు ఇలాంటి ఓటములు ఎదురవుతాయని ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. గురువారం రాత్రి కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ మాట్లాడాడు.

‘మేం కొన్ని చోట్ల తప్పులు చేశాం. ఆరంభం అద్భుతంగా చేసినా చివరికి అవసరమైన స్కోర్‌ చేయలేకపోయాం. ఆ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. అలాగే మొదట్లో సరిగ్గా బౌలింగ్‌ చేయలేకపోయాం. దీని గురించి లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. ముందుకు సాగాలంతే. నేను, డికాక్‌ శుభారంభం చేశాక మరికొన్ని కీలక భాగస్వామ్యాలు నిర్మించాల్సింది పోయి వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం. అలాగే ఎవరైనా క్రీజులోకి రాగానే దంచికొట్టడం అనేది అంత తేలికకాదు. కానీ, గత మ్యాచ్‌లోనూ ఇలాగే జరిగింది. దీనిమీద దృష్టి సారిస్తాం. ఇక పాయింట్ల పట్టికలో ఎక్కడ ఉన్నామనే సంగతి ఎప్పుడూ మదిలో ఏ మూలనో ఉంటుంది. ఇప్పటికైతే మేం మధ్యలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మిగతా మ్యాచ్‌ల్లో పోరాడి వరుస విజయాలు సాధిస్తామని ఆశిస్తున్నాం’ అని రోహిత్‌ వివరించాడు.

మా కోచ్‌కు ఇదే కావాలి: మోర్గాన్‌

ఇక కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ మాట్లాడుతూ గత రెండు మ్యాచ్‌ల్లో చేసిన ప్రదర్శనే తమ నుంచి కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ ఆశిస్తున్నాడని చెప్పాడు. ‘ఇలా ఆడటం మా నైపుణ్యాలకు సరిపోతుంది. ముంబయి ఇండియన్స్‌ లాంటి జట్టును 155 పరుగులకే కట్టడి చేసి తర్వాత దాన్ని ఛేదించడం మాకు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇక వరుసగా రెండో మ్యాచ్‌లో అదరగొట్టిన వెంకటేశ్‌ అయ్యర్‌కు తుది జట్టులో అవకాశం కల్పించడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే మా జట్టులో చాలా మంది నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. అయితే, అతడి ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రాక్టీస్‌ సెషన్లలోనూ అతడిలాగే చెలరేగిపోతాడు. ఇక సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి మా జట్టులో కీలక బౌలర్లు. నరైన్‌ కోల్‌కతా జట్టులో తప్పకుండా ఉండే ఆటగాడు. రెండో దశలో ఈ రెండు విజయాలు మాకు స్ఫూర్తిగా నిలుస్తాయి. పాయింట్ల పట్టికలో పైకి చేరడమే మా లక్ష్యం’ అని మోర్గాన్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని