Updated : 28 Sep 2021 11:53 IST

IPL 2021: ఏమైంది..! ముంబయి ఇలా ఎందుకు ఆడుతోంది?

ముంబయి ఇండియన్స్‌కు ఏమైంది?గత రెండు సీజన్లలో టైటిల్‌ సాధించి ఈసారి హ్యాట్రిక్‌ కొట్టాలని ఆశిస్తున్న ఆ జట్టు.. ఇప్పుడు వరుసగా మూడు మ్యాచ్‌లు కోల్పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో నిలిచింది. మరీ ముఖ్యంగా ఆదివారం రాత్రి బెంగళూరుతో తలపడిన సందర్భంగా 111 పరుగులకే కుప్పకూలి.. ఈ సీజన్‌పై ఆశలు వదులుకునే పరిస్థితికి చేరింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతున్నా.. ప్లేఆఫ్స్‌ చేరాలంటే మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటి ఓడినా ముంబయి ఆశలు గల్లంతే! ఈ నేపథ్యంలో ఆ జట్టు ఓటములకు కారణాలేంటో ఓసారి పరిశీలిద్దాం..

ఇప్పటివరకు ఎలా ఆడింది..?

ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ఏప్రిల్‌లో టోర్నీ ప్రారంభమైనప్పుడు గెలుపోటములతో దాగుడు మూతలు ఆడింది. తొలుత బెంగళూరుతో ఓటమిపాలైన ఆ జట్టు తర్వాత కోల్‌కతా, హైదరాబాద్‌లపై ప్రతాపం చూపించింది. ఆపై దిల్లీ, పంజాబ్‌ల చేతిలో విఫలమైనా తర్వాత రాజస్థాన్‌, చెన్నైలపై జయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలోనే బయోబుడగలో కరోనా వైరస్‌ ప్రవేశించి టోర్నీ వాయిదా పడింది. అప్పటికి ముంబయి ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక రెండో దశలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా అన్నింట్లోనూ ఓటమిపాలైంది. తొలుత చెన్నైతో భంగపడిన ముంబయి ఆపై కోల్‌కతా, బెంగళూరు చేతుల్లోనూ మొట్టికాయలు తింది. దీంతో మొత్తం పది మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది.

బ్యాట్స్‌మెన్‌దే వైఫల్యం..?

ముంబయి టీమ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (326), ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (251) మాత్రమే రాణిస్తున్నారు. ఒకరు విఫలమైనా మరొకరు ఆదుకుంటున్నారు. ఇద్దరూ కలిసి బాగా ఆడినా.. తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌ తేలిపోతున్నారు. అయితే ఇదే ఆ జట్టు ఓటములకు ప్రధాన సమస్యగా మారింది. అప్పుడప్పుడు మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ కీరన్‌ పొలార్డ్‌ (211) బ్యాట్‌కు పని చెబుతున్నా.. జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోతున్నాడు. గతేడాది సూపర్‌ బ్యాటింగ్‌తో జట్టుకు విజయాలు అందించిన సూర్యకుమార్‌‌, ఇషాన్‌ కిషన్‌ ఈసారి ఇబ్బందులు పడుతున్నారు. క్రీజులో నిలువలేక ప్రత్యర్థుల ముందు చిత్తవుతున్నారు. సూర్య ఆడిన 10 మ్యాచ్‌ల్లో 18.9 సగటుతో 189 పరుగులు చేయగా.. ఇషాన్‌ 8 మ్యాచ్‌ల్లో 13.37 సగటుతో 107 పరుగులే సాధించాడు. మరోవైపు ఎంతో నమ్మకం ఉన్న పాండ్య సోదరులు సైతం పూర్తిగా గాడి తప్పినట్లు కనిపిస్తున్నారు. కృనాల్‌ 10 మ్యాచ్‌ల్లో 13.44 సగటుతో 121 పరుగులు చేయగా హార్దిక్‌ 8 మ్యాచ్‌ల్లో 7.85 సగటుతో 55 పరుగులే చేశాడు. దీన్ని బట్టే ముంబయి బ్యాటింగ్‌ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

స్పిన్‌ తిరగట్లేదెందుకు..?

ముంబయి ఇండియన్స్‌ మరో ప్రధాన బలం పేస్‌ బౌలింగ్‌. ఆ జట్టు ఎప్పుడూ ప్రపంచ శ్రేణి పేసర్లపై ఆధారపడుతుంది. ఈసారి కూడా బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌తో బరిలోకి దిగుతోంది. కానీ, టీమ్‌ఇండియా పేసర్‌ ఒక్కడే రాణిస్తున్నాడు. గతేడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచిన కివీస్‌ పేసర్‌ ఈసారి ప్రభావం చూపించలేకపోతున్నాడు. ఆడిన 10 మ్యాచ్‌ల్లో 8.20 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. మరోవైపు బుమ్రా తొలి దశలో ఆకట్టుకోలేకపోయినా రెండో దశలో చెలరేగుతున్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అయితే, ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది స్పిన్‌ బౌలింగ్ గురించే. తొలి దశలో ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్లు తీసి ఆకట్టుకున్న రాహుల్ చాహర్‌ రెండో దశలో పూర్తిగా చేతులెత్తేశాడు. గత మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్‌ కూడా తీయకపోవడం గమనార్హం. ఇక కృనాల్‌ బౌలింగ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అతడు పది మ్యాచ్‌ల్లో కేవలం 3 వికెట్లే తీసి లయ తప్పినట్లు కనిపిస్తున్నాడు. మరోవైపు హార్దిక్ పాండ్య అసలు బౌలింగే చేయకపోవడం ముంబయిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

వీరిని ఆడించొచ్చుగా..?

(ఫొటో: క్రిస్‌ లిన్‌ ట్విటర్‌)

ఈసారి ముంబయి ఇండియన్స్‌ జట్టులో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ ఇలా వచ్చి అలా మెరిసిన వారు కూడా ఉన్నారు. అందులో ఒకరు క్రిస్‌లిన్‌ కాగా, మరొకరు సౌరభ్‌ తివారి. ఏప్రిల్‌లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు బెంగళూరుతో ఆడిన తొలి మ్యాచ్‌లోనే క్రిస్‌లిన్‌ (49) ఆకట్టుకున్నాడు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(19) విఫలమైనా లిన్‌ తన బ్యాటింగ్‌తో మెరిశాడు. అప్పుడు డికాక్ ఇంకా జట్టుతో కలవకపోవడంతో లిన్‌ బ్యాటింగ్‌ చేశాడు. కానీ అతడు ఆడింది ఆ ఒక్క మ్యాచే అయినా బ్యాటింగ్‌ మాత్రం అదరగొట్టాడు. తర్వాత డికాక్‌ జట్టులో చేరాక జట్టు యాజమాన్యం లిన్‌ను పక్కనపెట్టింది. అలాగే రెండో దశలో మిడిల్‌ ఆర్డర్‌లో హార్దిక్‌ పాండ్య ఆడని రెండు మ్యాచ్‌ల్లో సౌరభ్‌ తివారీకి చోటిచ్చింది. కోల్‌కతాతో ఆడిన మ్యాచ్‌లో అతడు పెద్దగా ఆడే అవకాశం రాకపోయినా అంతకుముందు చెన్నైతో తలపడిన సందర్భంగా అర్ధశతకం సాధించాడు. అయినా ఇప్పుడతడిని పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో ముంబయి మిగతా మ్యాచ్‌ల్లో రాణించాలంటే వీరికి చోటిచ్చి చూడాలి.

- ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని