IPL 2021: చెన్నైతో పోరులో ముంబయికి ఆ ఒక్కటే సమస్య

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడే మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఒక్కటే సమస్య అని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌లోని రెండో దశ మరికొన్ని...

Published : 19 Sep 2021 13:22 IST

ఆకాశ్‌ చోప్రా

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడే మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఒక్కటే సమస్య అని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌లోని రెండో దశ మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ముంబయి, చెన్నై జట్లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. అయితే, రోహిత్‌ సేన నెమ్మదిగా ఆరంభించడం మినహాయిస్తే మరే సమస్యా లేదని చోప్రా పేర్కొన్నాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ ముంబయి ఇండియన్స్‌ తన ఫేవరెట్‌ అని చెప్పాడు.

‘ముంబయి జట్టుకుండే ప్రధాన సమస్య చెన్నై పిచ్‌. ఇప్పుడా ఇబ్బంది లేదు. రోహిత్‌ శర్మ బాగా ఆడుతున్నాడు. మిగతా ఆటగాళ్లు రాణిస్తే బాగుంటుంది. నెమ్మదిగా ఆరంభించడం మినహాయిస్తే ఆ జట్టుకు ఎలాంటి సమస్య లేదనే చెప్పాలి. తొలి బంతి నుంచే దంచికొట్టాలి. ఓపెనర్లుగా రోహిత్‌, డికాక్‌ బరిలోకి దిగుతారు. తర్వాత ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, పాండ్య సోదరులు, పొలార్డ్‌ వరుసగా ఉన్నారు. వీళ్లంతా రాణిస్తే మంచి స్కోర్‌ సాధించగలరు. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే రాహుల్‌ చాహర్‌ను కచ్చితంగా ఆడిస్తారు. తర్వాత ఉండే ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లు నిప్పులు చెరగాలి. ఇందులో ఆడం మిల్నే లేదా నాథన్‌ కౌల్టర్‌ నైల్‌.. ఇద్దరిలో ఒకర్ని తీసుకోవాలి. ఆడం అదనపు పేస్‌ వేయగలడు కాబట్టి అతడైతే బాగుంటుంది. చివర్లో బుమ్రా, బౌల్ట్‌ ఉన్నారు. దీంతో చెన్నైతో తలపడేందుకు ఈ జట్టు సరిగ్గా సరిపోతుంది. మరోవైపు ముంబయి ఆటగాళ్లకు ఎలాంటి గాయాల బెడద కూడా లేదు’ అని చోప్రా పేర్కొన్నాడు

మరోవైపు చెన్నై టీమ్‌పైనా స్పందించిన మాజీ క్రికెటర్‌.. ఈ మ్యాచ్‌లో చెన్నై శార్దూల్‌ ఠాకూర్‌ను కచ్చితంగా ఆడించాలన్నాడు. ఓపెనర్లుగా రుతురాజ్‌, డుప్లెసిస్‌ ఉన్నారని, ఆపై మొయిన్‌ అలీ, రైనా, అంబటి రాయుడు, కెప్టెన్‌ ధోనీ ఉన్నారని గుర్తుచేశాడు. అయితే, రైనా ఈ సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధశతకమే సాధించిన నేపథ్యంలో ఇప్పుడు చెలరేగిపోవాలని సూచించాడు. ఇక బ్రావో, జడేజా కూడా ఆల్‌రౌండర్లుగా అందుబాటులో ఉండటంతో చెన్నై ఇక్కడి వరకూ బ్యాటింగ్‌ చేయగలదని తెలిపాడు. మరోవైపు సామ్‌కరన్‌ ఉండి ఉంటే ఇంకా బాగుండేదని చోప్రా అభిప్రాయపడ్డాడు. బౌలింగ్‌ విభాగం దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌తో బలంగా ఉందన్నాడు. ముంబయిని కట్టడి చేయలంటే వీరంతా సమష్టిగా రాణించాలన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని