Punjab Fans trolling Anil Kumble: ‘కుంబ్లేను కోచ్‌గా నియమించాలంటే బీసీసీఐ ఆలోచించాలి’

త్వరలోనే కుంబ్లే టీమ్‌ఇండియా కొత్త కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో బీసీసీఐ ఆ నిర్ణయం తీసుకునేముందు పునరాలోచించాలని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు...

Published : 23 Sep 2021 01:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పంజాబ్‌ కింగ్స్‌ హెడ్‌కోచ్‌ అనిల్‌ కుంబ్లేపై ఆ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జట్టు ఎంపిక సరిగ్గా లేదని, ఓటమికి కుంబ్లే కుంటి సాకులు చెబుతున్నారని అభిమానులు మండిపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో దిగ్గజ స్పిన్నర్‌ను ట్రోల్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు త్వరలోనే కుంబ్లే టీమ్‌ఇండియా కొత్త కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో బీసీసీఐ ఆ నిర్ణయం తీసుకునేముందు పునరాలోచించాలని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగింది..?

మంగళవారం రాత్రి పంజాబ్‌, రాజస్థాన్‌ జట్లు తలపడ్డాయి. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ సంచలన విజయం సాధించింది. చివరి ఓవర్‌లో పంజాబ్‌ విజయానికి చేతిలో 8 వికెట్లు ఉండగా నాలుగు పరుగులే అవసరమయ్యాయి. అప్పటికి మార్‌క్రమ్‌(26; 20 బంతుల్లో 2x4, 1x6‌), నికోలస్‌ పూరన్‌(32; 22 బంతుల్లో 1x4, 2x6) క్రీజులో ఉన్నారు. దీంతో అంతా ఆ జట్టే విజయం సాధిస్తుందని భావించారు. కానీ, ఆ ఓవర్‌లో కార్తీక్‌ త్యాగి మాయ చేశాడు. అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఒక్క పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దీంతో రాజస్థాన్‌ సంచలన విజయం నమోదు చేసింది. తొలుత ఆ జట్టు 185 పరుగులు చేయగా ఛేదనలో పంజాబ్‌ 183/4 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్‌ మూడో బంతికి పూరన్‌.. శాంసన్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు. తర్వాతి బంతికి దీపక్‌ హుడా(0) పరుగులు చేయలేదు. ఐదో బంతికి అతడూ ఔటవ్వడంతో మ్యాచ్‌ నరాలు తెగే ఉత్కంఠస్థితికి చేరింది. చివరి బంతికి పంజాబ్‌ మూడు పరుగులు చేయాల్సిన స్థితిలో ఫాబియన్‌ అలెన్‌(0) పరుగులు చేయలేకపోయాడు. దాంతో ఆ జట్టు ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో కుంబ్లేపై ఆ జట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘బీసీసీఐ ఆలోచించాలి’

(Photo: Punjab Kings Twitter)

పంజాబ్‌ తుది జట్టులో ప్రధానంగా క్రిస్‌గేల్‌, రవి బిష్ణోయ్‌ లాంటి కీలక ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో అతడి కోచింగ్‌ సామర్థ్యాన్ని నిందిస్తున్నారు. మరికొందరు ఒకడుగు ముందుకేసి.. కుంబ్లే త్వరలో టీమ్‌ఇండియా కోచింగ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో బీసీసీఐ ఆ నిర్ణయం తీసుకునేముందు ఆలోచించాలని కోరుతున్నారు. కుంబ్లే కోచింగ్‌ సామర్థ్యానికి ఈ ఐపీఎల్‌ ఒక ట్రైలర్‌ లాంటిదని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి ఒత్తిడిని తట్టుకోలేకపోతే, సరైన జట్టును ఎంపిక చేయలేకపోతే బీసీసీఐ ఇతర ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని అంటున్నారు. అయితే, చివరి ఓవర్‌లో ఆటగాళ్లు సరిగ్గా ఆడకపోతే కోచ్‌ మాత్రం ఏం చేయగలడని మరికొందరు అతడికి అండగా నిలుస్తున్నారు.

‘గేల్‌ను ఎందుకు తీసుకోలేదో చెప్పాలి’

(Photo: Punjab Kings Twitter)

మరోవైపు టీ20 క్రికెట్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల మాజీ క్రికెటర్లు కెవిన్‌ పీటర్సన్‌, సునీల్‌ గావస్కర్‌ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మ్యాచ్‌కు ముందు కామెంట్రీలో పీటర్సన్‌ మాట్లాడుతూ.. గేల్‌ తీవ్ర నిరాశకు గురై ఉంటాడని అన్నాడు. అతడిని ఎందుకు తుది జట్టులోకి తీసుకోలేదనే ప్రశ్నలు పంజాబ్‌కు ఉత్పన్నమవుతాయని తెలిపాడు. ముఖ్యంగా అతడి పుట్టిన రోజు(మంగళవారం) నాడు పక్కకు పెట్టడం అర్థం కాలేదని అన్నాడు. ఒక్క మ్యాచ్‌లో అతడిని ఆడించాల్సి వస్తే అది ఈ మ్యాచే అని పీటర్సన్‌ అభిప్రాయపడ్డాడు. అనంతరం గావస్కర్‌ కూడా ఇలాగే స్పందించాడు. ఈ విషయంలో తాను కూడా ఆశ్చర్యపోయానన్నాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఎంపిక చేసిన నలుగురు ఆటగాళ్లు మ్యాచ్‌ విన్నర్లేనని, అయితే.. గేల్‌ను అతడి పుట్టిన రోజున పక్కనపెట్టడం సరికాదని విచారం వ్యక్తం చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని