IPL 2021: ముంబయి స్పిన్నర్లను ఒత్తిడిలోకి నెట్టి.. బౌండరీలు బాదాలనుకున్నా: త్రిపాఠి

ముంబయి ఇండియన్స్‌ స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకొని వారిపై ఒత్తిడి తేవాలనుకున్నట్లు, దాంతో బౌండరీలు సాధించాలనుకున్నట్లు కోల్‌కతా యువ బ్యా్ట్స్‌మన్‌ రాహుల్‌ త్రిపాఠి తెలిపాడు...

Published : 24 Sep 2021 11:47 IST

(Photo: KKR Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌ స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకొని వారిపై ఒత్తిడి తేవాలనుకున్నట్లు, దాంతో బౌండరీలు సాధించాలనుకున్నట్లు కోల్‌కతా యువ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ త్రిపాఠి తెలిపాడు. గురువారం రాత్రి ముంబయితో తలపడిన మ్యాచ్‌లో కోల్‌కతా 156 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లే కోల్పోయి 15.1 ఓవర్లలో ఛేదించిన సంగతి తెలిసిందే. రాహుల్‌ త్రిపాఠి (74 నాటౌట్‌; 42 బంతుల్లో 8x4, 3x6), వెంకటేశ్‌ అయ్యర్‌ (53; 30 బంతుల్లో 4x4, 3x6) దంచికొట్టడంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో టాప్‌ నాలుగులోకి దూసుకెళ్లింది. మ్యాచ్‌ అనంతరం రాహుల్‌ మాట్లాడుతూ తన బ్యాటింగ్‌ను ఆస్వాదించినట్లు చెప్పాడు.

‘ఈ మ్యాచ్‌లో నా బ్యాటింగ్‌ను బాగా ఆస్వాదించా. చివరి వరకూ క్రీజులో నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చినందుకు సంతోషంగా ఉంది. మేం ఎప్పుడూ పాజిటీవ్‌గా ఉండాలని మా కోచ్‌ చెబుతుంటాడు. మనం అలా ఉంటే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు పరుగుల కోసం ఆలోచించొచ్చు. మరోవైపు ముంబయి స్పిన్నర్లను ఒత్తిడిలోకి నెట్టి బౌండరీలు సాధించాలనుకున్నా. ఇప్పుడు మా జట్టులో మంచి వాతావరణం నెలకొంది’ అని రాహుల్‌ పేర్కొన్నాడు.

ఎక్కడైనా బ్యాటింగ్‌ చేస్తా: నరైన్‌

అనంతరం మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైన సునీల్‌ నరైన్‌ మాట్లాడుతూ.. ‘నేను రోజు రోజుకు మెరగవుతున్నా. ఇక్కడికి రాకముందు సీపీఎల్‌, హండ్రెడ్‌ లీగుల్లో ఆడాను. ఇలా రాణించడానికి చాలా కష్టపడ్డాను. అయితే, ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఏ ఫార్మాట్‌లో ఔట్‌ చేసినా గొప్ప విషయమే. ఆ జట్టులో అతడిది కీలకమైన వికెట్‌. ఇక మా జట్టులో వరుణ్‌ చక్రవర్తి లాంటి స్పిన్నర్‌ ఉండటం మంచి విషయం. దేన్నైనా త్వరగా నేర్చుకుంటాడు. నా బ్యాటింగ్‌ విషయానికొస్తే జట్టు అవసరాలను బట్టి ఆడతాను. టాప్‌లో ఆడమన్నా.. లోయర్‌ ఆర్డర్‌లో ఆడమన్నా.. ఎక్కడైనా బ్యాటింగ్‌ చేస్తా’ అని నరైన్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని