IPL 2021: క్రీడాస్ఫూర్తి గురించి ఉపన్యాసాలు ఇవ్వకండి : అశ్విన్‌

అమర్యాదకర పదాల్ని ఉపయోగించడం మానుకోవాల్సిందిగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్, బౌలర్‌ టిమ్‌ సౌథీలకు దిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పష్టంచేశాడు...

Updated : 01 Oct 2021 14:48 IST

మోర్గాన్, సౌథీలకు చురక

దుబాయ్‌: అమర్యాదకర పదాల్ని ఉపయోగించడం మానుకోవాల్సిందిగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్, బౌలర్‌ టిమ్‌ సౌథీలకు దిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పష్టంచేశాడు. క్రికెట్‌ స్ఫూర్తి గురించి తనకు ఉపన్యాసాలు ఇవ్వొద్దని సూచించాడు. మంగళవారం దిల్లీ, కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్‌లో రాహుల్‌ త్రిపాఠి విసిరిన త్రో రిషబ్‌ పంత్‌ను తాకి వెళ్తుండగా అశ్విన్‌ పరుగు కోసం ప్రయత్నించాడు. ఇలాంటి సందర్భంలో పరుగు తీయొచ్చని ఎంసీసీ నిబంధనల్లో ఉంది. అయితే అశ్విన్‌ చర్య సిగ్గుచేటని.. క్రికెట్‌ స్ఫూర్తికి విరుద్ధమని మోర్గాన్‌ విమర్శించాడు. అశ్విన్‌ ఔటవగానే.. ‘‘మోసం చేస్తే ఇలాగే జరుగుతుంది’’ అని దిల్లీ ఆటగాడిని ఉద్దేశిస్తూ సౌథీ వ్యాఖ్యానించాడు. అనంతరం అశ్విన్‌తో, సౌథీ, మోర్గాన్‌ వాగ్వాదానికి దిగారు. దినేశ్‌ కార్తీక్‌ సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అయితే ఈ వ్యవహారంపై అశ్విన్‌ గురువారం ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ‘‘ఫీల్డర్‌ విసిరిన బంతి పంత్‌ను తాకిందన్న సంగతి నాకు తెలియదు. ఆ సమయంలో పరుగు కోసం వెళ్తున్నా. పంత్‌కు బంతి తాకిందని తెలిసినా నేను పరుగు కోసం ప్రయత్నించేవాడిని. అందుకు నిబంధనలు అనుమతిస్తాయి. మోర్గాన్‌ మాదిరి అమర్యాదకర వ్యక్తిని నేను కాదు. క్రికెట్‌ స్ఫూర్తి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండదు. నేను గొడవకు దిగలేదు. మైదానంలో చివరి దాకా పోరాడటం.. నిబంధనలకు లోబడి ఆడటం.. మ్యాచ్‌ పూర్తవగానే కరచాలనాలు ఇచ్చుకోవడమే క్రీడా స్ఫూర్తి అని నాకు తెలుసు’’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని