Updated : 23 Sep 2021 13:30 IST

IPL 2021 - Sunrisers: హైదరాబాద్‌ ఆశలు అస్తమయం.. కారణాలివే!

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ది ప్రత్యేక ప్రస్థానం. డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలో 2016లో తొలిసారి టైటిల్‌ సాధించిన ఆ జట్టు ఆపై ఏటా ప్లేఆఫ్స్‌ చేరుతూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. అయితే, ఈసారి పేలవ ఆటతీరుతో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించింది. తాజాగా దిల్లీతో ఆడిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలై ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు చేసుకుంది. ఒకవేళ ఇప్పుడైనా ప్లేఆఫ్స్‌ చేరాలనే ఆశలు ఉంటే ఇకపై మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. అది కూడా ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వైఫల్యానికి గల కారణాలేంటో ఒకసారి తెలుసుకుందాం.

ఆడితే టాప్‌ ఆర్డరే..

సన్‌రైజర్స్‌ జట్టులో ప్రధాన బ్యాట్స్‌మెన్‌ బెయిర్‌స్టో, డేవిడ్‌ వార్నర్‌, కెప్టెన్‌ విలియమ్సన్‌, మనీశ్‌ పాండే. ఈ నలుగురు ఆడితేనే గౌరవప్రదమైన స్కోర్‌ చేస్తోంది. లేదంటే అంతే సంగతులు. రెండో దశలో బెయిర్‌స్టో ఆడని కారణంగా బ్యాటింగ్‌ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. బెయిర్‌స్టో ఈ సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 41.33 సగటుతో 248 పరుగులు చేశాడు. దీంతో సన్‌రైజర్స్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. తర్వాత మనీశ్‌ పాండే ఆరు మ్యాచ్‌ల్లో 42 సగటుతో 210 పరుగులతో కొనసాగుతున్నాడు. ఆపై డేవిడ్‌ వార్నర్‌ ఏడు మ్యాచ్‌ల్లో 27.57 సగటుతో 193 పరుగులతో మూడో స్థానంలో, విలియమ్సన్‌ ఐదు మ్యాచ్‌ల్లో 73 సగటుతో 146 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచారు. తర్వాత అబ్దుల్‌ సమద్‌ ఐదు మ్యాచ్‌ల్లో 16 సగటుతో 64 పరుగులు.. విజయ్‌ శంకర్‌ ఏడు మ్యాచ్‌ల్లో 11.60 సగటుతో 58 పరుగులు.. కేదార్‌ జాధవ్‌ ఐదు మ్యాచ్‌ల్లో 14.33 సగటుతో 43 పరుగులు.. మహ్మద్‌ నబి రెండు మ్యాచ్‌ల్లో 15.50 సగటుతో 31 పరుగులు.. వృద్ధిమాన్‌ సాహా మూడు మ్యాచ్‌ల్లో 8.66 సగటుతో 26 పరుగులు మాత్రమే చేశారు. దీన్ని బట్టి టాప్ నలుగురు మినహా మిడిల్‌ ఆర్డర్‌ మొత్తం చేతులెత్తేసినట్లేనని స్పష్టంగా తెలుస్తోంది. జట్టులోని 26 మంది సభ్యుల్లో 21 మందిని ఆడించి చూసినా.. మెరుగైన జట్టు కూర్పును సాధించలేకపోవడం గమనార్హం.  

బౌలింగ్‌ కూడా అంతంతే..

ఇదివరకు సన్‌రైజర్స్‌ బౌలింగ్‌కు మంచి పేరుండేది. బ్యాట్స్‌మెన్‌ తక్కువ పరుగులు సాధించినా.. జట్టు బౌలింగ్‌ విభాగం మాత్రం ఆకట్టుకునేది. ఎన్నో సందర్భాల్లో బౌలర్లే మ్యాచ్‌ విన్నర్లుగా నిలిచారు. ఇన్ని రోజులు అంత ప్రభావం చూపిన సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ బృందం ఈ సీజన్‌లో మాత్రం విఫలమైంది. రషీద్‌ ఖాన్‌ మినహా మిగతా బౌలర్లెవ్వరూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. రషీద్‌ ఎనిమిది మ్యాచ్‌ల్లో 6.18 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టి ఈ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు ఎంతో అనుభవజ్ఞుడైన భువనేశ్వర్‌ కుమార్‌ పూర్తిగా తేలిపోయాడు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 8.81 ఎకానమీతో 3 వికెట్లే తీశాడు. ఖలీల్‌ అహ్మద్‌ ఆరు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు.. విజయ్ శంకర్‌, సిద్ధార్థ్‌ కౌల్‌ చెరో మూడు వికెట్లు మాత్రమే తీశారు. గత సీజన్లలో ఆకట్టుకున్న సందీప్‌ శర్మ నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే తీశాడు. ఇక గాయాల కారణంగా నటరాజన్‌, హోల్డర్‌ తొలి భాగంలో దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా కారణంగా నటరాజన్‌ మరోసారి దూరమయ్యాడు. దీంతో ఈసారి జట్టు బౌలింగ్‌ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి.

ఎనిమిదిలో నాలుగు గెలవాల్సినవే..

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచే అవకాశం లభించినా చేజేతులా ఓటమి పాలైంది. తొలి అర్ధభాగంలో కోల్‌కతా, బెంగళూరు, ముంబయి, దిల్లీ జట్లతో ఆడిన మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌ టీమ్‌ సునాయాస విజయాలు సాధించాల్సి ఉంది. కానీ, మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యంతో ఆ మ్యాచ్‌లన్నీ కోల్పోయింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

* ఏప్రిల్‌లో ఈ సీజన్‌లో మొదలైనప్పుడు తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌ అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు సాహా (7), వార్నర్‌(3) విఫలమైనా... మనీశ్‌ పాండే(61), జానీ బెయిర్‌స్టో(55) మ్యాచ్‌ను మలుపు తిప్పారు. అయితే, కీలక సమయంలో ఇద్దరూ ఔటవ్వడంతో పాటు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో విజయానికి 10 పరుగుల దూరంలో నిలిచి తొలి ఓటమి చవిచూసింది.

* ఇక రెండో మ్యాచ్‌లో బెంగళూరు 149/8 స్కోర్‌ చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ అలవోకగా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. సాహా(1) మరోసారి విఫలమయ్యాడు. కానీ, వార్నర్‌(54), మనీష్‌(38) ఆదుకున్నారు. వీరిద్దరూ ఔటయ్యాక మిగతా బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో హైదరాబాద్‌ విజయానికి చేరువగా వచ్చి 143/9 పరుగులకే పరిమితమైంది. ఇలా రెండోసారి ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

* ముంబయితో తలపడిన మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌ గెలవాల్సిన పరిస్థితి. ఆ జట్టు నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని హైదరాబాద్‌ టీమ్‌కు షాకిచ్చింది. ఓపెనర్లు వార్నర్‌(36), బెయిర్‌స్టో(43) సగం స్కోర్‌ పూర్తిచేసినా మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. మనీశ్‌ పాండే(2) నిరాశ పర్చాడు. మరోవైపు విజయ్‌ శంకర్‌(28) పోరాడినా అతడికి సహకరించే బ్యాట్స్‌మెన్‌ లేక 13 పరుగుల తేడాతో పరాభవం పాలైంది.

* ఇక నాలుగో మ్యాచ్‌లో పంజాబ్‌పై 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన సన్‌రైజర్స్‌ ఐదో మ్యాచ్‌లో దిల్లీతో తలపడింది. అయితే, ఆ జట్టు నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 159/7 పరుగులే చేసింది. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమంగా మారి ఫలితం సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. అక్కడ దిల్లీ విజయం సాధించింది. అంతకుముందు చివరి ఓవర్‌లో సన్‌రైజర్స్‌కు 16 పరుగులు అవసరం కాగా కేన్‌ విలియమ్సన్‌(66*), జగదీశ సుచిత్‌(14*) ధాటిగా ఆడి 15 పరుగులు చేశారు. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా ఒకే పరుగు సాధించారు. దీంతో సూపర్‌ ఓవర్‌లో ఒత్తిడికిలోనై ఈ మ్యాచ్‌ను కూడా కోల్పోయారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్