IPL 2021: కోల్‌కతాతో ఓటమిపాలయ్యాక.. పంత్‌, పృథ్వీ కంటతడి!

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో క్వాలిఫయర్‌-2లో ఓటమిపాలైన సందర్భంగా దిల్లీ క్యాపిటల్స్‌ బ్యాట్స్‌మెన్‌ రిషభ్‌ పంత్‌, ఓపెనర్‌ పృథ్వీషా కంటతడి పెట్టారు...

Published : 14 Oct 2021 20:49 IST

(Photo: Prithvi Shaw Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో క్వాలిఫయర్‌-2లో ఓటమిపాలైన సందర్భంగా దిల్లీ క్యాపిటల్స్‌ బ్యాట్స్‌మెన్‌ రిషభ్‌ పంత్‌, ఓపెనర్‌ పృథ్వీషా కంటతడి పెట్టారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ నిర్ణీత ఓవర్లలో 135/5 స్వల్ప స్కోర్‌ చేసింది. అనంతరం ఛేదనలో కోల్‌కతా ఓపెనర్లు వెంకటేశ్‌ అయ్యర్‌ (55), శుభ్‌మన్‌ గిల్‌ (46) ధాటిగా ఆడి తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించారు. దీంతో ఆ జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. ఈ క్రమంలోనే కోల్‌కతా సునాయాస విజయం సాధిస్తుందని ఆశించినా చివరి నాలుగు ఓవర్లలో దిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఏకంగా మ్యాచ్‌ గెలించేంత పని ప్రత్యర్థికి చెమటలు పట్టించింది.

కోల్‌కతా విజయానికి 24 బంతుల్లో 13 పరుగులు అవసరమైన వేళ దిల్లీ పేసర్లు అవేశ్‌ ఖాన్‌, నార్జే, రబాడ కట్టుదిట్టంగా బంతులేశారు. 17, 18, 19 ఓవర్లలో బౌలింగ్‌ చేసి ఆరు పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశారు. దీంతో ఒక్కసారిగా దిల్లీ పోటీలోకి వచ్చి ఆ శిబిరంలో ఆశలు నింపింది. ఆఖరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి 7 పరుగులు అవసరమైన వేళ అశ్విన్‌ బౌలింగ్‌ చేసి తొలి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి షకిబ్‌ (0), నరైన్‌ (0)ను ఔట్‌ చేశాడు. ఇక కోల్‌కతా విజయానికి రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరమైన వేళ దిల్లీ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. అలాంటి ఉత్కంఠ పరిస్థితుల్లోనే రాహుల్‌ త్రిపాఠి (12) సిక్సర్‌ బాది తమ జట్టును గెలిపించాడు. దీంతో ఈసారైన కప్పు గెలవాలని అనుకున్న దిల్లీ క్యాపిటల్స్‌ కల చెదిరింది.

ఈ నేపథ్యంలోనే పృథ్వీ, పంత్‌ ఓటమిపాలయ్యాక కంటతడి పెట్టారు. పృథ్వీ మైదానంలోనే కిందపడి భావోద్వేగం చెందాడు. తోటి ఆటగాళ్లు అతడిని పైకి లేపి డ్రెస్సింగ్‌ రూమ్‌క తీసుకెళ్లారు. మరోవైపు కెప్టెన్‌ పంత్‌ కూడా బాధతో కనిపించాడు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరోవైపు కోల్‌కతా అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఓటమిటంచుల దాకా వెళ్లి చివరికి సంచలన విజయం సాధించడంపై నెటిజెన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. రాహుల్‌ను మెచ్చుకుంటూనే చివరి నాలుగు ఓవర్లలో ఆ జట్టు బ్యాటింగ్‌ తీరును ఇలా 0, 1 ,1, W, 0, 0, 0, 0, 0, 0, 1, W, 2, 0, 1, 0, 0, W, 1, 0, W, W, SIX! ఉందంటూ సరదాగా స్పందిస్తున్నారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని