
IPL 2021: కోల్‌కతా ముందే ఆడటం వల్ల మాకు కలిసి వస్తుంది : రోహిత్ శర్మ
ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు మూడు జట్లు చేరుకున్నాయి. ఇక మిగిలిన నాలుగో స్థానం కోసం కోల్‌కతా, ముంబయి జట్లు ప్రధానంగా పోటీపడుతున్నాయి. మరోవైపు రాజస్థాన్, పంజాబ్ సాంకేతికంగా ఇంకా పోటీలో ఉన్నా.. అవి ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యమే. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోవు. అయితే, ముంబయి టీమ్ లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చివరి మ్యాచ్‌లో ఆడటం వల్ల ప్లేఆఫ్స్‌కు చేరాలంటే.. మ్యాచ్‌కు ముందే తమకు ఏం చేయాలనే విషయంపై స్పష్టత వస్తుందని ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
గత మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ముంబయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. నెట్ రన్‌రేట్ -0.048గా నమోదైంది. మరోవైపు కోల్‌కతా 12 పాయింట్లతోనే ఉన్నా మెరుగైన రన్‌రేట్ +0.294 కారణంగా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ రెండింటిలో ఒకటి కచ్చితంగా ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కోల్‌కతా ఈ రోజు రాజస్థాన్‌తో తన చివరి మ్యాచ్‌లో తలపడనుండగా ఇక్కడ విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులో మరింత ముందుండాలని భావిస్తోంది. అదే సమయంలో ముంబయి తన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో ఓడితే మోర్గాన్ టీమ్ నాలుగో స్థానం ఖరారైనట్లే. ఒకవేళ రాజస్థాన్ చేతిలో ఓడితే.. అప్పుడు ముంబయి తన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై విజయం సాధిస్తే సరిపోతుంది. అలా కాకుండా రాజస్థాన్‌పై కోల్‌కతా గెలిస్తే మాత్రం.. అప్పుడు ముంబయి సన్‌రైజర్స్‌పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాతో వర్చువల్‌గా మాట్లాడిన రోహిత్.. లీగ్ దశలో తాము చివరి మ్యాచ్ సన్‌రైజర్స్‌తో ఆడటం వల్ల తమకు కలిసి వస్తుందని చెప్పాడు. ‘ఐపీఎల్‌లో ప్రతి జట్టూ మిగిలిన అన్ని జట్లను ఓడించే సత్తా ఉన్నవే. అయితే, లీగ్ దశలో కోల్‌కతా మా కన్నా ముందే రాజస్థాన్‌తో తన చివరి మ్యాచ్‌లో తలపడుతుండటంతో.. మేం సన్‌రైజర్స్‌తో ఎలా ఆడితే ప్లేఆఫ్స్ చేరుతామనే విషయం ముందుగానే స్పష్టమవుతుంది’ అని వివరించాడు. అలాగే రాజస్థాన్‌పై గత మ్యాచ్‌లో విజయం సాధించడంపైనా మాట్లాడుతూ.. ఇంతకుముందు మ్యాచ్‌లో తాము రెండు పాయింట్లు సాధించి రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాల్సి ఉండగా దాన్ని పూర్తి చేశామని వెల్లడించాడు. ఆ మ్యాచ్ తమకు తిరిగి పుంజుకునే అవకాశం కల్పించిందని రోహిత్ తెలిపారు.