IPL 2021: ఇక్కడ కష్టమని తెలుసు.. ఈ పిచ్‌ వైవిధ్యంగా ఉంటుంది

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ మరో ఓటమి చవిచూసింది. శనివారం దిల్లీతో తలపడిన సందర్భంగా ఆ జట్టు 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది...

Published : 03 Oct 2021 11:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ మరో ఓటమి చవిచూసింది. శనివారం దిల్లీతో తలపడిన సందర్భంగా ఆ జట్టు 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 129/8 తక్కువ స్కోరుకే పరిమితమవ్వగా.. దిల్లీ 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పిచ్‌ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు ఏమన్నారంటే..

స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాం: రోహిత్‌
‘ఇదో కష్టతరమైన వేదిక అని ముందే తెలుసు. షార్జా వేదికగా జరిగిన ఎన్నో మ్యాచ్‌లు చూశాం. ఇక్కడ మనకు కావాల్సినన్ని పరుగులు వచ్చే అవకాశం ఉండదని అర్థం చేసుకున్నాం. అందుకు సిద్ధపడే బరిలోకి దిగాం. దీంతో బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఎలా ఆడాలనే విషయాలపైనా చర్చించుకున్నాం. అయినా ఆడలేకపోయాం. సరైన భాగస్వామ్యాలు నిర్మించలేకపోయాం. ఈ వికెట్‌పై 170-180 పరుగులు సాధిస్తామనే ఆలోచనలు లేవు. 140 అయితే ఫర్వాలేదనుకున్నాం. బ్యాట్స్‌మెన్‌ సరైన పరుగులు చేయలేకపోతే నిలకడగా విజయాలు సాధించడం కష్టం. ఈ సీజన్‌లో మేం సరిగ్గా బ్యాటింగ్‌ చేయడం లేదని ఒప్పుకొంటా. అయితే, నేను బ్యాట్స్‌మెన్‌ను నిందించడం లేదు. జట్టుగా బాగా సన్నద్ధమవుతున్నాం. కానీ, మధ్యలో విఫలమవుతున్నాం. అదే మమ్మల్ని నిరాశకు గురిచేస్తోంది. మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాం. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలవడానికి ప్రయత్నిస్తాం’ అని రోహిత్‌ అన్నాడు.

ఇది వైవిధ్యమైన పిచ్‌: పంత్‌

‘షార్జాలో ఎప్పుడు ఆడినా ఇతర పిచ్‌ల కన్నా వైవిధ్యంగా ఉంటుందని తెలుసు. దీంతో ఇది కష్టంగా సాధించిన విజయమే అనుకుంటాం. అయితే, ఈ మ్యాచ్‌లో మేం పవర్‌ప్లేలో పూర్తిగా పేస్‌ బౌలింగే వేయించాలనుకున్నాం. ఎందుకంటే తర్వాత స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించాం. ఈ క్రమంలోనే పొలార్డ్‌, హార్దిక్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు అశ్విన్‌కు చివర్లో ఒక ఓవర్‌ మిగిలి ఉంచాలని అనుకున్నా. వాళ్లని ఆఖర్లో కట్టడి చేయాలని ప్రణాళిక వేసుకున్నాం. ఇక ఈ సీజన్‌లో మాకు దొరికిన ఆణిముత్యం అవేశ్‌ ఖాన్‌. అతడు అద్భుతంగా బౌలింగ్‌ చేస్తూ కీలక వికెట్లు తీస్తున్నాడు. జట్టుకు బాగా ఉపయోగపడుతున్నాడు. ఇకపోతే ఛేదనలో నేనూ, శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు చివరి వరకూ క్రీజులో ఉండాలనుకున్నాం. కానీ, నేను ఔటైన విధానం నిరాశకు గురిచేసింది. ఆ షాట్‌ నేను అనుకున్నట్లు వెళ్లలేదు. ఇవన్నీ ఆటలో భాగం. ఎవరైనా ఒక బ్యాట్స్‌మెన్‌ పవర్‌ప్లేలో దంచికొట్టాలి. ఈరోజు నేను ఆ బాధ్యత తీసుకోవాలనుకున్నా’ అని పంత్‌ పేర్కొన్నాడు.

అందుకు తగ్గట్టే సిద్ధమయ్యా: శ్రేయస్‌

ఇక మ్యాచ్‌లో జట్టును విజయతీరాలకు చేర్చిన శ్రేయస్‌ అయ్యర్‌(33*) దిల్లీని గెలిపించడం అద్భుతంగా ఉందన్నాడు. ఇది తక్కువ స్కోర్‌ కలిగిన మ్యాచ్‌ కాబట్టి చివరి వరకు క్రీజులో నిలవాలనుకున్నట్లు చెప్పాడు. ‘నా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు జరిగినా అందుకు తగ్గట్టు సిద్ధమయ్యా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జట్టును గెలిపిస్తాననే నమ్మకం ఉంది. మనం సానుకూలంగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. ఈ క్రమంలోనే అశ్విన్‌ కూడా అదే ఆలోచనా విధానంతో బాగా ఆడాడు. సింగిల్స్‌ తీస్తూ స్ట్రైక్‌ రొటేట్‌ చేశాడు. మేమిద్దరం ఆఖరివరకు క్రీజులో నిలవాలని అనుకున్నాం. అందుకు నాకు పూర్తిగా సహకరించాడు. మరోవైపు మా జట్టు గత రెండేళ్లలో చాలా మారిపోయింది. 2019 నుంచి జట్టులోని పరిస్థితులు పూర్తి అనుకూలంగా మారాయి. లీగ్ దశలో ప్రతి పాయింట్‌ కూడా ముఖ్యమే. ఎందుకంటే టాప్‌ రెండు జట్లలో నిలిస్తే ప్లేఆఫ్స్‌లో ఒకటి గెలవగానే నేరుగా ఫైనల్స్‌ చేరే అవకాశం ఉంటుంది. అందుకోసమే లీగ్‌ స్టేజ్‌లో ప్రతి మ్యాచ్‌ గెలవడానికి ప్రయత్నిస్తాం’ అని శ్రేయస్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు