T20 World Cup: పాకిస్థాన్‌ టీ20 జట్టులో షోయబ్‌ మాలిక్‌.. సంతోషంలో అఫ్రిది

పాకిస్థాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను మళ్లీ టీ20 ప్రపంచకప్‌ జట్టులో చూడటం బాగుందని ఆ జట్టు మాజీ సారథి షాహిద్‌ అఫ్రిది సంబరపడ్డాడు. పొట్టి ప్రపంచకప్‌ టోర్నీకి ముందు పాక్‌ జట్టులో...

Updated : 11 Oct 2021 02:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను మళ్లీ టీ20 ప్రపంచకప్‌ జట్టులో చూడటం బాగుందని ఆ జట్టు మాజీ సారథి షాహిద్‌ అఫ్రిది సంబరపడ్డాడు. పొట్టి ప్రపంచకప్‌ టోర్నీకి ముందు పాక్‌ జట్టులో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ షోయబ్‌ మక్సూద్‌ గాయంతో తప్పుకోవడంతో 39 ఏళ్ల మాలిక్‌ను తుది జట్టులో ఎంపిక చేశారు. కాగా, అతడికిది ఆరో టీ20 ప్రపంచకప్‌ కావడం విశేషం. ఈ క్రమంలోనే అఫ్రిది తాజాగా రెండు ట్వీట్లు చేస్తూ.. మాలిక్‌ లాంటి అనుభవజ్ఞుడు జట్టుతో కలిసి ఉండటం మంచిదని అన్నాడు. తన సీనియారిటీతో జట్టును ముందుండి నడిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి వెళ్లే ఆటగాళ్లందరి కోసం నేను మనసారా ప్రార్థిస్తున్నా. నా మద్దతు మీకెప్పుడూ ఉంటుంది. మీరు బాగా ఆడి జట్టును విజేతగా నిలపండి. మమ్మల్ని అందర్నీ గర్వపడేలా చేస్తారని ఆశిస్తున్నా’ అని అఫ్రిది ట్వీట్‌ చేశాడు. కాగా, మాలిక్‌ 2007లో అరంగేట్రం టీ20 ప్రపంచకప్‌ నుంచీ ఆ జట్టుతో కొనసాగుతున్నాడు. తొలి టోర్నీలోనే పాకిస్థాన్‌కు సారథ్యం వహించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఆపై 2009లో పాక్‌ ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2010 టోర్నీలో ఆడలేకపోయిన అతడు గత మూడు టోర్నీల్లోనూ ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలోనే మరోసారి టీ20 ప్రపంచకప్‌లో ఆడబోతున్నాడు. ఇక ఈనెల 24న పాకిస్థాన్‌ భారత్‌తో తొలి మ్యాచ్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని