IPL 2021: చెన్నై సూపర్‌ కింగ్స్‌కు అగ్ని పరీక్షే!

ఐపీఎల్‌లో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఒకటి. ముంబయి ఇండియన్స్‌ తర్వాత అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా ధోనీసేనకు ప్రత్యేక గుర్తింపు ఉంది...

Updated : 09 Oct 2021 09:39 IST

దిల్లీతో తొలి క్వాలిఫయర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌లో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఒకటి. ముంబయి ఇండియన్స్‌ తర్వాత అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా ధోనీసేనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే, గతేడాది పేలవ ఆటతీరుతో కనీసం ప్లేఆఫ్స్‌ చేరకుండా ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి ఇంటిముఖం పట్టిన ఆ జట్టు ఈసారి విజృంభించి ఆడింది. దిల్లీతో సమానంగా విజయాలు సాధిస్తూ ప్లేఆఫ్స్‌ బెర్తునూ ముందే ఖరారు చేసుకుంది. కానీ, ఇప్పుడు వరుసగా మూడు ఓటములు చవిచూసి అనూహ్యంగా కంగుతింది. ఆదివారం దిల్లీతో క్వాలిఫయర్‌ 1లో తలపడుతున్న నేపథ్యంలో ధోనీసేన ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దామా..

ఆ ఓటములకు కారణాలేంటి?

చెన్నై గురువారం రాత్రి తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌తో తలపడింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 134/6 స్కోరే చేసింది. డుప్లెసిస్‌ (76; 55బంతుల్లో 8x4, 2x6) ధాటిగా ఆడినా మిగతా బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు. ఛేదనలో పంజాబ్ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (98*; 42 బంతుల్లో 7x4, 8x6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడు ఒంటి చేత్తో మ్యాచ్‌ను 13 ఓవర్లలోనే పూర్తి చేశాడు. దీంతో ఈ పిచ్‌ పెద్ద ప్రమాదకరమేమీ కాదని తెలుస్తోంది. బ్యాట్స్‌మెన్‌ వైఫల్యమే చెన్నై ఓటమికి ప్రధాన కారణమని స్పష్టంగా అర్థమవుతోంది.

అంతకుముందు దిల్లీ క్యాపిటల్స్‌తోనూ ఇదే మైదానంలో చెన్నై తొలుత బ్యాటింగ్‌ చేసి 136/5 స్వల్ప స్కోరే నమోదు చేసింది. ఈసారి అంబటి రాయుడు (55*; 43 బంతుల్లో 5x4, 2x6) ఆదుకున్నాడు. అనంతరం దిల్లీ సైతం ఛేదనలో తడబాటుకు గురైంది. 19.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇక ఈ మ్యాచ్‌కు ముందు అబుదాబి వేదికగా రాజస్థాన్‌తో జరిగిన పోరులోనూ చెన్నై ఓటమిపాలైంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (101; 60 బంతుల్లో 9x4, 5x6) సూపర్‌ సెంచరీతో చెలరేగడంతో పాటు ఇతరులు సైతం బ్యాట్లకు పనిచెప్పారు. దీంతో 189 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అయితే, రాజస్థాన్‌ ఛేదనలో సునాయాసంగా గెలిచి ధోనీసేనకు షాకిచ్చింది. 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసింది. శివమ్‌ దూబె(64; 42 బంతుల్లో 4x4, 4x6), యశస్వి జైశ్వాల్‌ (50; 21 బంతుల్లో 6x4, 3x6) దంచికొట్టారు. దీన్ని బట్టి చెన్నై బౌలింగ్‌ ఎలా ఉందనేది అర్థమవుతోంది.

హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ..

ఈ మూడు ఓటములకు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లోనూ ధోనీసేన 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కష్టపడింది. రుతురాజ్‌ (45; 38 బంతుల్లో 4x4, 2x6), డుప్లెసిస్‌ (41; 36 బంతుల్లో 3x4, 2x6) మెరిశారు. చివరలో రాయుడు (17*), ధోనీ (14*) పలు బౌండరీలు బాదడంతో 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ అంశాలన్నీ లెక్కలోకి తీసుకుంటే చెన్నై టీమ్‌ అనుకున్నంత బలంగా కనిపించడంలేదు.

దిల్లీతో గెలిస్తే ఓకే.. లేదంటే..!

ఇక ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ప్లేఆఫ్స్‌లో ఎవరెవరు ఏయే జట్లతో తలపడనున్నారో ఖరారైంది. దిల్లీ, చెన్నై పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవగా.. బెంగళూరు, కోల్‌కతా జట్లు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. దీంతో ఆదివారం తొలి క్వాలిఫయర్‌లో దిల్లీ, చెన్నై పోటీపడనున్నాయి. చెన్నై ఇక్కడ గెలిస్తే నేరుగా ఫైనల్‌ చేరనుంది. ఒకవేళ ఓడినా రెండో క్వాలిఫయర్‌లో అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పటికే వరుసగా మూడు ఓటములతో సతమతమవుతున్న ధోనీసేన ప్రస్తుతం పూర్తి బలంగా ఉన్న దిల్లీని ఓడించడం అంత తేలిక కాదు. ఇక అప్పుడు కూడా ఓటమిపాలైతే రెండో క్వాలిఫయర్‌లో పుంజుకోవడం కష్టమనే చెప్పాలి. ఏదేమైనా ఆదివారం ధోనీసేన గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని