IPL 2021: 2011 తర్వాత ఇదే తొలిసారి : విరాట్‌ కోహ్లీ

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా రెండో ఏడాది ప్లేఆఫ్స్‌ చేరింది. గతేడాది ఎలిమినేటర్‌ మ్యాచ్‌ వరకూ వెళ్లిన కోహ్లీసేన ఈ సీజన్‌లో గతరాత్రి పంజాబ్‌ను ఓడించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది...

Updated : 04 Oct 2021 11:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా రెండో ఏడాది ప్లేఆఫ్స్‌ చేరింది. ఈ సీజన్‌లో గతరాత్రి పంజాబ్‌ను ఓడించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. 2011 తర్వాత తమ జట్టు తొలిసారి లీగ్‌ దశలో పలు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లేఆఫ్స్‌ చేరినట్లు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు.

‘12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించడం గొప్పగా ఉంది. ఇప్పుడు మాకింకా రెండు మ్యాచ్‌లు ఉండటంతో పాయింట్ల పట్టికలో టాప్‌ రెండులో నిలిచే అవకాశం ఉంది. అదే జరిగితే మాకు మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే, ఏ జట్టుకైనా తొలి అడ్డంకి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడమే. అది ఇప్పుడు మేం దాటేశాం. కానీ, మా ఆటలో దృష్టి సారించాల్సిన లోపాలున్నాయి. మిగతా మ్యాచ్‌ల్లో వాటిని సరిదిద్దుకొని టాప్‌ 2లో నిలవడానికి ప్రయత్నిస్తాం. ఈ పిచ్‌పై 15-20 పరుగులు కూడా కీలకంగా మారతాయి. ఈ పిచ్‌ ఆడేకొద్దీ నెమ్మదిస్తుందని తెలుసు. ధాటిగా ఆడటం అంత తేలిక కాదని అర్థమైంది. ఇకపోతే పంజాబ్‌ జట్టులో రాహుల్‌, మయాంక్‌ బాగా ఆడారు. అయితే, ఈ రెండు వికెట్లు తీస్తే మళ్లీ మేం ఈ మ్యాచ్‌లో పుంజుకుంటామని తెలుసు. ఈ క్రమంలోనే మా బౌలర్లు సరైన సమయంలో చెలరేగి వికెట్లు తీశారు. సిరాజ్‌,  హర్షల్‌, చాహల్‌, షాబాజ్‌, గార్టన్‌ అంతా అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఈసారి మా ఆటగాళ్లు ఎవరికి వారు సొంతంగా బాధ్యత తీసుకొని ఆడారు. అందుకు సంతోషంగా ఉంది’ అని విరాట్‌ స్పందించాడు.

మా బౌలర్లను తప్పుబట్టలేం: రాహుల్‌

ఇక ఈ ఓటమితో ప్లేఆఫ్స్‌ అర్హత కోల్పోయిన పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ.. గతకొన్నేళ్లుగా టాప్‌ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తుండటంతో ఆరెంజ్‌ క్యాప్‌ తన వద్దకు వస్తోందని, అయితే తాము ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించి ఉంటే ఇంకా సంతోషంగా ఉండేదని చెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌లో బెంగళూరు మంచి స్కోరే సాధించిందని.. మరో 10-15 పరుగులు అదనంగా సాధించారని వివరించాడు. అలాగే మాక్స్‌వెల్‌ చెలరేగితే ఎవరూ ఏమీ చేయలేరన్నాడు. ఈ విషయంలో బౌలర్లను పెద్దగా తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నాడు. మరోవైపు తమ జట్టు బ్యాటింగ్‌ కూడా సరిగ్గా లేదని విచారం వ్యక్తం చేశాడు. ‘క్రికెట్‌ అనేది జట్టుగా ఆడే ఆట. జట్టుకు అవసరమైన రీతిలో మేం బ్యాటింగ్‌ చేస్తాం. టీ20ల్లో ఓపెనర్లే ఎక్కువ పరుగులు చేసే అవకాశం ఉంటుంది. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఒక సీజన్‌లో 500-600 పరుగులు చేయలేరు. అయితే, ఏ జట్టుకైనా మధ్యలో పరుగులు చేసే ఆటగాళ్లు ఉండాలి. మా జట్టులోని యువకులు బాగా ఆడుతున్నారు. షారుఖ్‌, రవిబిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌, హర్‌ప్రీత్‌ లాంటి ఆటగాళ్లు గత నాలుగైదు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన కనబరిచారు. వాళ్లు మనసుపెట్టి ఆడటం చూస్తుంటే గొప్పగా ఉంది. ఇకపై జరిగే మ్యాచ్‌ల్లో ఎలా పరుగులు చేయాలో ఆలోచించాలి’ అని పంజాబ్‌ కెప్టెన్ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని