Published : 27 Sep 2021 10:20 IST

IPL 2021: 30 పరుగుల తేడాతో 8 వికెట్లు.. నమ్మశక్యం కాలేదు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్ ప్లేఆఫ్స్‌ రేసుకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మరింత చేరువైంది. ఇంకో రెండు విజయాలు సాధిస్తే ఆ జట్టు బెర్తు ఖారారు చేసుకునే అవకాశం ఉంది. గతరాత్రి ముంబయితో తలపడిన మ్యాచ్‌లో సంచలన బౌలింగ్‌తో బెంగళూరు ఆకట్టుకుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌ను 111 పరుగులకే కుప్పకూల్చి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో నిలిచింది. ఈ విజయంపై కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తమ బౌలింగ్‌ పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.

‘మేం గెలిచిన తీరుపై చాలా ఆనందంగా ఉంది. ఆదిలోనే దేవ్‌దత్‌ వికెట్ కోల్పోయి మ్యాచ్‌ను ప్రారంభించాం. ఇక బుమ్రా తన బౌలింగ్‌తో ముంబయికి శుభారంభం అందించాడు. అక్కడి నుంచి మ్యాచ్‌లో మా ముద్ర వేయడం అవసరమైంది. నేను బాగా ఆడాను. శ్రీకర్‌ భరత్‌ కూడా మంచి సహకారం అందించాడు. దాంతో నాపై ఒత్తిడి తగ్గింది. అనంతరం మాక్స్‌వెల్‌ ఆడిన తీరు అమోఘం. అయితే, మేం సాధించిన 166 పరుగులు మోస్తరు స్కోరే. ఇక ముంబయి ఇన్నింగ్స్‌లో 30 పరుగుల తేడాతో మా బౌలర్లు 8 వికెట్లు పడగొట్టడం నమ్మశక్యం కానిది. ఈ ఆటలో మొత్తం మా ప్రదర్శనకు 10 పాయింట్లు ఇస్తే.. బ్యాటింగ్‌ పరంగా 8 పాయింట్లు ఇస్తా. ఎందుకంటే మేం సుమారు 20 పరుగులు ఎక్కువ సాధించాల్సి ఉండేది’ అని కోహ్లీ వివరించాడు.

ఇషాన్‌పై ఒత్తిడి తేవాలనుకోలేదు: రోహిత్‌
‘మా బౌలింగ్‌ బాగుందని అనుకుంటున్నా. ఒకస్థితిలో బెంగళూరు 180+ స్కోర్‌ సాధించేలా కనిపించింది. కానీ, మమ్మల్ని బ్యాట్స్‌మెనే ముంచేశారు. ఈ సీజన్‌లో ఆ సమస్య కొనసాగుతోంది. ఈ విషయంపై బ్యాట్స్‌మెన్‌ అందరితోనూ మాట్లాడాను. అవసరమైనప్పుడు ఎవరైనా బాధ్యత తీసుకోవాలని చెప్పాను. అయితే, మా బ్యాటింగ్‌లో రెండు, మూడు వికెట్లు పడగానే బెంగళూరు బౌలర్లు మాపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఇకపై బాగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం మాకుంది. అయితే, ఈ సీజన్‌లోనే అది జరగడం లేదు. అలాగే ఇషాన్‌ కిషన్‌ మా జట్టులో ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడు. అతడి సహజసిద్ధమైన బ్యాటింగ్‌ను ప్రోత్సహించేందుకే సూర్యకుమార్‌ కన్నా ముందు పంపిస్తున్నాం. అతడిపై మరీ ఒత్తిడి తేవాలనుకోవడం లేదు. అతడు యువ ఆటగాడు ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగులు వేస్తున్నాడు’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని