
IPL 2021: ముంబయి ఇండియన్స్ ప్రదర్శనతో బాధపడను.. ఎందుకంటే?: ఆకాశ్ అంబానీ
ఇంటర్నెట్‌డెస్క్: ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ ప్రదర్శన చూసి బాధపడనని ఆ ఫ్రాంఛైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ అన్నారు. వరుసగా రెండేళ్లు ఛాంపియన్స్‌గా నిలిచిన రోహిత్‌సేన ఈసారి త్రుటిలో ప్లేఆఫ్స్ అవకాశాన్ని కోల్పోయింది. లీగ్ దశలో కోల్‌కతాతో సమానంగా 14 పాయింట్లతో నిలిచినా రన్‌రేట్ మెరుగ్గా లేకపోవడంతో ఐదో స్థానంలో నిలిచింది. దీంతో మోర్గాన్ టీమ్ నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ముంబయి జట్టుతో ఆకాశ్ మాట్లాడిన వీడియోను ఆ ఫ్రాంఛైజీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
‘ఈ నాలుగేళ్లలో (2017-2021) మూడుసార్లు ట్రోఫీలు సాధించడం అంత ఆషామాషీ కాదు. ఇక రాబోయే రెండేళ్లు కూడా ఎలా ఆడతామనే విషయంపై మాకు ఎంతో నమ్మకం ఉంది. అలాగే ఈ సీజన్ ఫలితాలు చూసి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పటికే అత్యంత విజయవంతమైన జట్టుగా ఎదిగాం. మీ అందరికీ కృతజ్ఞతలు. ముంబయి ఇండియన్స్ తరఫున ప్రతి ఒక్కరు సమష్టిగా రాణించారు. ఇలాంటి జట్టుని కలిగి ఉండటం మా అదృష్టం. మీరంతా ఒక కుటుంబంలా ఉన్నారు. భవిష్యత్‌లో ఎవరు ఎక్కడ ఉంటారనేది పక్కనపెడితే ముంబయి ఇండియన్స్ మిమ్మల్ని ఎప్పుడూ ఒకేలా చూస్తుంది’ అని ఆకాశ్ తన జట్టుకు అండగా నిలిచాడు.
రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబయి ఇండియన్స్ 2013 నుంచి 2019 వరకు ఏడాది తప్పిచ్చి ఏడాది వరుసగా నాలుగుసార్లు టైటిల్ సాధించింది. ఈ క్రమంలోనే గతేడాది యూఏఈలో ఆ సంప్రదాయాన్ని బద్దలుకొట్టి ఐదుసార్లు విజేతగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో ఈసారి కూడా ఛాంపియన్స్‌గా అవతరించి హ్యాట్రిక్ సాధిస్తుందని అభిమానులు ఆశించగా.. నిరాశపర్చింది. పలు కీలక మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది.