
IPL : యే దోస్తీ.. హమ్ నహీ తోడేంగే!
మైదానంలో ప్రత్యర్థులు... బ్యాట్ పడితే దంచి కొట్టాలనే కసి... బంతి అందితే వికెట్ తీయాలనే తపన... ఆట ముగిస్తే.. అన్నీ మర్చిపోయి హగ్గులిచ్చుకునే దోస్తులు! దేశాలు వేరైనా దోస్తీ శాశ్వతం అంటున్నారు కొందరు క్రికెటర్లు. ఎవరా ఆటగాళ్లు? ఎల్లలు దాటి మనవాళ్లతో ఎక్కడ చిగురించిందీ స్నేహం అంటారా? రండి.. ఈ విశ్వ స్నేహితుల గురించి తెలుసుకుందాం.
ఏబీ డివిలియర్స్ - విరాట్ కోహ్లి
(Photo: Virat Kohli Instagram)
ఇద్దరూ బ్యాటింగ్ దిగ్గజాలే. అంతర్జాతీయ క్రికెట్లో మైదానంలో ప్రత్యర్థులు. కానీ ఐపీఎల్లో మంచి స్నేహితులు. ఒకరంటే మరొకరికి గౌరవం. ఆటతీరు నచ్చుతుంది. ఈ ఇద్దరూ ఆర్సీబీకి మూలస్తంభాల్లా మారాక స్నేహ బంధం మరింత బలపడింది. ఇప్పుడు ఇద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. సామాజిక మాధ్యమాల్లో రెండు కుటుంబాలు కలిసి దిగిన ఫొటోలు అప్పుడప్పుడూ షేర్ చేసుకుంటుంటారు. ‘మా ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే చాలానే ఉంది. నాకు కోహ్లితో ఏమైనా చెప్పాలన్నా భయమే. నీ షూస్ బాగున్నాయి అని చెప్పాననుకోండి. మరుసటిరోజుకల్లా అలాంటివే నా ర్యాక్‌లో ఉంటాయి. అయ్యో ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందే అంటే పవర్‌బ్యాంక్ నా చేతిలో ఉంటుంది. నాకు కాఫీ ఇష్టం అని చెప్తే మరుసటి రోజుకల్లా ఎస్ప్రెస్సో మెషిన్ మా ఇంటిముందుంటుంది. మా స్నేహం గురించి ఇంతకన్నా ఏం చెప్పాలి?’ అంటూ ఓ ఇంటర్వ్యూలో విరాట్ గురించి గొప్పగా చెప్పాడు డివిలియర్స్.
టి.నటరాజన్ - డేవిడ్ వార్నర్
(Photo: T.Natarajan Instagram)
డేవిడ్ వార్నర్ దూకుడైన బ్యాట్స్‌మన్. తంగరసు నటరాజన్ భారత బౌలింగ్ యువ సంచలనం. ఈ ఇద్దరినీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కలిపింది. రోజులు గడిచినకొద్దీ దోస్తీ పెరిగింది. ఐపీఎల్-13తో నటరాజన్ వెలుగులోకి వచ్చాడు. తర్వాత ఆస్ట్రేలియా సిరీస్‌లో అదరగొట్టాడు. అప్పుడే వార్నర్‌కి నట్టూ ప్రతిభపై గురి కుదిరింది. తనపై నమ్మకంతో పలు సందర్భాల్లో తురుపుముక్కలా ఉపయోగించుకొని మంచి ఫలితాలు రాబట్టాడు. దాంతోపాటు సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా స్నేహం చిగురించింది. వార్నర్ తన సన్నిహితులకు పార్టీ ఇస్తే అందులో నటరాజన్ ఉండి తీరాల్సిందే. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో నట్టూకి ప్రత్యేక ఆహ్వానం అందింది. నటరాజన్ వార్నర్‌ని స్నేహితుడిగానే కాదు.. ఓ అన్నలా భావిస్తుంటాడు.
ఎం.ఎస్.ధోనీ - డ్వేన్ బ్రావో
(Photo: Dwayne Bravo Instagram)
ఐపీఎల్లో క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరబ్బా? అంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లు ఎం.ఎస్.ధోనీ, డ్వేన్ బ్రావోలవే. చెన్నై ఇద్దరిని ఒకచోటికి చేర్చితే, ఒరర్నొకరు విడదీయలేనంత స్నేహం అల్లుకుంది ఇద్దరి మధ్య. ధోనీ మిస్టర్ కూల్ అయితే.. బ్రావో ఎంటర్టైన్మెంట్ పర్సన్. తరచూ జోక్స్ పేల్చుతుంటాడు. దాంతోపాటు ఆటలోనూ ఇరగదీస్తాడు. అదే ధోనీకి నచ్చింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా బ్రావో చేతిలో బంతి పెడుతుంటాడు. వ్యక్తిగత విషయానికొస్తే ఇద్దరిదీ ఎవరినీ నొప్పించని మనస్తత్వం. వారు ఒక్కచోట చేరితే నవ్వులే నవ్వులు. ఇక ఎలాంటి ఆంక్షల్లేకుండా ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లిపోతుంటారు. బ్రావో.. ధోనీ భార్య సాక్షిని ‘చెల్లీ’ అని పిలుస్తుంటాడు.
జస్ప్రిత్ బుమ్రా - లసిత్ మలింగ
(Photo: Jasprit Bumrah Instagram)
ఇద్దరూ యార్కర్ వీరులే. భారత్, శ్రీలంక జట్ల తరపున బరిలోకి దిగిన కొన్నేళ్లు మైదానంలో ప్రత్యర్థులు. మలింగ ఎనిమిదేళ్ల కిందట ముంబై ఇండియన్స్‌లో చేరాక వారి మధ్య దోస్తీ కుదిరింది. అప్పట్నుంచి బుమ్రా తననుంచి బౌలింగ్ కిటుకులెన్నో పట్టేశాడు. తర్వాత ఇద్దరూ కలిసి వ్యక్తిగతంగా టూర్లకెళ్లడం, పార్టీలు చేసుకోవడం ఎన్నెన్నో. మలింగ ముంబైని వీడిపోతున్న సమయంలో తన బాధనంతా ట్వీట్ రూపంలో పంచుకున్నాడు బుమ్రా. ‘నీలాంటి ప్రతిభావంతుడితో కలిసి ఆడటం గర్వంగా భావించా. నువ్వు లేకపోవడం ముంబయికే కాదు.. ఐపీఎల్‌కే లోటు. నిన్ను వ్యక్తిగతంగా ఎంతో మిస్ అవుతున్నా’ అంటూ తన బాధని పంచుకున్నాడు.
కీరన్ పొలార్డ్ - హార్దిక్ పాండ్య
(Photo: Hardik Pandya Instagram)
పవర్ హిట్టింగ్‌కి మారుపేరు కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య. ఆటతీరులాగే ఇద్దరివీ దూకుడైన మనస్తత్వాలు. బహుశా అదే స్నేహం కుదరడానికి కారణమైందేమో! ఇద్దరూ ముంబయిలో ఉంటే సందడే సందడి. కలిసి పార్టీలకెళ్లడం, ఫ్యామిలీలతో కలిసి సెల్ఫీలు దిగి సోషల్‌మీడియాలో పంచుకోవడం షరా మామూలే. మా ఇద్దరిది అన్నదమ్ముల అనుబంధం అంటాడు హార్దిక్. హార్దిక్ పక్కనుంటేనే నా జోష్ రెట్టింపవుతుంది అంటాడు పొలార్డ్. ఇద్దరినీ కలిపింది ముంబై ఇండియన్స్ అని ప్రత్యేకంగా వేరే చెప్పాలా? వాళ్లిద్దరికీ వికెట్ల మధ్య మంచి సమన్వయం ఉంటుంది కూడా! ఇక ఒకరి ఆటను మరొకరు బాగా ఎంజాయ్ చేస్తారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.