Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంకొంత కాలం వేచి చూడాల్సింది: పఠాన్

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ టీ20 కెప్టెన్‌గా వైదొలగాలనే నిర్ణయం తీసుకోవాల్సింది కాదని, ఈ విషయం గురించి జట్టు యాజమాన్యంతో చర్చించి ఉండాలని మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు...

Published : 19 Sep 2021 01:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ టీ20 కెప్టెన్‌గా వైదొలగాలనే నిర్ణయం తీసుకోవాల్సింది కాదని, ఈ విషయం గురించి జట్టు యాజమాన్యంతో చర్చించి ఉండాలని మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. అతడు మరికొంత కాలం వేచి చూడాల్సిందని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన పఠాన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమ్‌ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉండాలనే విషయాన్ని తాను ఒప్పుకోనని, ఒక్కడే మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించాలని సూచించాడు.

మరోవైపు ఇద్దరు కెప్టెన్ల పద్ధతి మనది కాదని, దాన్ని విదేశీ జట్లు పాటిస్తాయని మాజీ పేసర్‌ చెప్పుకొచ్చాడు. టీమ్‌ఇండియాకు ఒక్క సారథి ఉంటేనే ఉపయోగకరమని తెలిపాడు. సరిగ్గా ప్రపంచకప్‌ టోర్నీకి ముందు కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు. అయితే, ఒక ఆటగాడిగా అనేక విషయాలు బుర్రలో తిరుగుతాయని చెప్పాడు. అలాంటప్పుడే ఏం చేయాలనేదానిపై స్నేహితులు, కుటుంబసభ్యులు, కోచ్‌లతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని ఇర్ఫాన్‌ సూచించాడు.

కాగా, కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా ఆలోచించి ఉంటాడని కూడా మాజీ పేసర్‌ అభిప్రాయపడ్డాడు. అయితే, అతడి సారథ్యంలోనే టీమ్‌ఇండియా ఈసారి ప్రపంచకప్‌ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. కోహ్లీ మరికొన్ని రోజులు టీ20 కెప్టెన్‌గా కొనసాగి ఉంటే అతడి నాయకత్వం ప్రతిభ ఏంటో ప్రపంచానికి తెలియజేసేవాడని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే విరాట్‌ ఇంకొంత కాలం వేచి చూడాల్సిందని మాజీ పేసర్‌ విచారం వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని