Jos Butller: నేనూ నా కుటుంబం క్రికెట్‌ కోసం ఎంతో త్యాగం చేశాం: బట్లర్

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే యాషెస్‌ సిరీస్‌కు వెళ్లాలా వద్దా అనే విషయంపై ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్ తర్జనభర్జన పడుతున్నాడు‌. ప్రస్తుతం కరోనా విషయంలో ఆస్ట్రేలియా కచ్చితమైన క్వారంటైన్...

Published : 23 Aug 2021 01:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే యాషెస్‌ సిరీస్‌కు వెళ్లాలా వద్దా అనే విషయంపై ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్ తర్జనభర్జన పడుతున్నాడు‌. ప్రస్తుతం కరోనా విషయంలో ఆస్ట్రేలియా కచ్చితమైన క్వారంటైన్‌, బయోబబుల్‌ నిబంధనలు పాటిస్తున్న నేపథ్యంలో కుటుంబంతో సహా అక్కడికి అనుమతిస్తారా లేదా చూడాలన్నాడు. ఈ క్రమంలోనే రెండు నెలల సుదీర్ఘ పర్యటనకు  వెళ్లడంపై బట్లర్‌ సంకోచిస్తున్నాడు. యాషెస్‌ సిరీస్‌ పర్యటనపై పూర్తి సమాచారం తెలియనంతవరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేనని చెప్పాడు.

అదే సమయంలో క్రికెట్‌ కోసం తానూ, తన భార్య లూయిస్‌ ఎంతో త్యాగం చేశామని పేర్కొన్నాడు. ప్రతి ఆటగాడు ఏదో ఒక సమయంలో క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని, అప్పుడు కుటుంబమే ముఖ్యమని ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మన్‌ అభిప్రాయపడ్డాడు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ధైర్యంగా ముందడుగు వేయాలన్నాడు. అలాగే కొంత మంది ఆటగాళ్లు క్రికెట్‌కు దూరమవ్వడం కూడా బాధగా ఉంటుందన్నాడు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌ తర్వాత బట్లర్‌ ఐపీఎల్‌ ఆడాల్సి ఉంది. అయితే, అదే సమయంలో అతడి సతీమణి రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న పరిస్థితుల్లో మిగిలిన సీజన్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాజస్థాన్‌ రాయల్స్‌ గతరాత్రి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. మరోవైపు మేలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌తో తలపడిన మ్యాచ్‌లో బట్లర్‌ శతకంతో చెలరేగాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని