
T20 World Cup: తుదిపోరులో ఆసీస్ వైపే పీటర్సన్, అక్రమ్ మొగ్గు
ఇంటర్నెట్‌డెస్క్: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియానే విజయం సాధిస్తుందని మాజీ ఆటగాళ్లు కెవిన్ పీటర్సన్, వసీమ్ అక్రమ్ అన్నారు. ఇద్దరూ వేర్వేరు వేదికల్లో స్పందిస్తూ కంగారూలకే ఓటేశారు. పీటర్సన్ ఓ బ్లాగ్‌లో ఇలా రాసుకొచ్చాడు. ‘న్యూజిలాండ్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నా ఆసీస్ జట్టే ఫేవరెట్‌గా అనిపిస్తుంది. ఇదివరకు జరిగిన కీలక మ్యాచ్‌ల్లోనూ కివీస్‌పై ఆస్ట్రేలియానే ఆధిపత్యం చెలాయించింది. 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్ అందుకు నిదర్శనం. దీంతో ఈరోజు కూడా ఆ జట్టు విజయం సాధిస్తుంది’ అని పేర్కొన్నాడు.
‘చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఆస్ట్రేలియా చెలరేగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే తీరుతారు. అందుకే ఆ జట్టు ఎన్నో ఏళ్ల పాటు ఎదురులేని జట్టుగా కొనసాగింది. వాళ్లు ఏదైనా కీలక టోర్నీల్లో సెమీఫైనల్ చేరారంటే కచ్చితంగా అదనపు శక్తిని సంపాదించుకుంటారు. అందుకు డేవిడ్ వార్నరే పెద్ద ఉదాహరణ. ఐపీఎల్‌లో అతడు సన్‌రైజర్స్ తరఫున పరుగులు చేయలేక ఇబ్బందులు పడ్డాడు. ఈ ప్రపంచకప్‌లో జట్టుకు అవసరమైన వేళ తానేంటో చేసి చూపించాడు’ అని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు.
ఇక వసీమ్ అక్రమ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియా ఫేవరెట్ జట్లలో ఒకటి కాదని చెప్పాడు. అంతకుముందు ఆడిన పొట్టి సిరీస్‌ల్లో ఆ జట్టు ప్రదర్శన ఏ మాత్రం బాగోలేదని గుర్తుచేశాడు. టీ20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్ కీలక ఆటగాడని, అతడు దూకుడైన బ్యాట్స్‌మన్ అని పేర్కొన్నాడు. అతడు సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చాడని కితాబిచ్చాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌తో తలపడే తుదిపోరులో కంగారూలు విజయం సాధించే అవకాశాలే కాస్త ఎక్కువగా ఉన్నాయన్నాడు. ప్రస్తుత జట్టులో స్టీవ్‌స్మిత్ పరుగులు చేయలేకపోతున్నా ఆ జట్టు బలంగా ఉందన్నాడు. మాక్స్‌వెల్, స్టాయినిస్ కీలకమని అభిప్రాయపడ్డాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.