Badminton Championship: రెండు పతకాలు ఖాయం.. పీవీ సింధు ఓటమి 

బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం చేసుకున్న తెలుగు కుర్రాడు కిదాంబి ...

Updated : 17 Dec 2021 20:56 IST

క్వార్టర్‌ ఫైనల్‌లో ముగిసిన పీవీ సింధు పోరాటం

ఇంటర్నెట్‌ డెస్క్: బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. బీడబ్ల్యూసీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్‌, మరో ఆటగాడు లక్ష్యసేన్‌ సెమీస్‌కు చేరారు. నెదర్లాండ్స్‌ ఆటగాడు మార్క్ కాల్జివౌను 21-8, 21-7తో చిత్తు చేసిన కిదాంబి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. కెరీర్‌లో మొదటిసారి కాల్జివౌతో తలపడిన శ్రీకాంత్ తొలి నుంచీ దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆట చివరి వరకూ ఏకపక్షంగా సాగింది. మరోవైపు జన్ పెంగ్‌పై 21-15, 15-21, 22-20 తేడాతో లక్ష్యసేన్‌ గెలుపొందాడు. దీంతో సెమీస్‌లో శ్రీకాంత్‌తోనే ఫైనల్‌ బెర్తు కోసం పోరాటం చేయనున్నాడు. ఈ క్రమంలో కాంస్యంతోపాటు స్వర్ణం/రజతం పతకాల్లో ఏదొకటి భారత్‌ సొంతమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పురుషుల పోటీల్లో ప్రకాశ్ పదుకొణె (1983), సాయి ప్రణీత్‌ (2019) మాత్రమే కాంస్య పతకాలను అందుకున్నారు. వీరి సరసన కిదాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ చేరతారు. 

మరోవైపు ఛాంపియన్‌ పీవీ సింధు పోరాటం క్వార్టర్‌ఫైనల్‌లోనే ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ చేతిలో ఓడిపోయింది. 42 నిమిషాలపాటు సాగిన పోరులో సింధు 17-21, 13-21తో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో గట్టి పోటీ ఇచ్చిన సింధుకు ప్రత్యర్థి నుంచి ఓటమి తప్పలేదు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెట్‌ను తై జు కైవసం చేసుకుంది. రెండో సెట్‌లోనూ ప్రారంభంలో కాస్త ప్రతిఘటించినా.. ఆఖరికి సింధు చేతులెత్తేయడంతో తై జు విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో భారత్‌ తరఫున పీవీ సింధు (2019) స్వర్ణ పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే. 

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని