IND vs NZ: భారత్‌పై షహీన్‌ అఫ్రిదిలాగే బౌలింగ్ చేయాలనుకుంటున్నా: బౌల్ట్‌

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమ్‌ఇండియా నేడు న్యూజిలాండ్‌తో కీలకపోరులో తలపడనుంది. ఇరు జట్లకూ ఇది కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది. పాకిస్థాన్‌తో రెండు జట్లూ ఓడిన నేపథ్యంలో...

Updated : 16 Nov 2021 15:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమ్‌ఇండియా నేడు న్యూజిలాండ్‌తో కీలకపోరులో తలపడనుంది. ఇరు జట్లకూ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. పాకిస్థాన్‌తో రెండు జట్లూ ఓడిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌ ఆసక్తిగా మారింది. ఇందులో ఓడిన జట్టు సెమీస్‌ అవకాశాలు దాదాపు కోల్పోయినట్లే. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన కివీస్‌ పేసర్‌ ట్రెంట్‌బోల్డ్‌.. ఈ మ్యాచ్‌లో తాము టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ను ఎలా కట్టడి చేయాలనుకుంటున్నామో వివరించాడు.

తొలుత భారత టాప్‌ఆర్డర్‌ను టార్గెట్‌ చేయాలనుకుంటున్నట్లు కివీస్‌ పేసర్‌ స్పష్టం చేశాడు. ఆదిలోనే టీమ్‌ఇండియా బ్యాటర్లను కట్టడి చేసి కోహ్లీసేనపై ఒత్తిడి తేవాలనుకుంటున్నట్లు చెప్పాడు. అదే తమ బౌలర్ల ప్రధాన కర్తవ్యమన్నాడు. అందుకోసం తమ బౌలింగ్‌కు పదను పెట్టాలని, సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బంతులు విసరాలని వివరించాడు. మరోవైపు భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో షహీన్‌ అఫ్రిది ఎలా బౌలింగ్‌ చేశాడో తానూ అలా చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. టీమ్‌ఇండియా టాప్‌ఆర్డర్‌ను కట్టడి చేయడంలో పాక్‌ పేసర్‌ అద్భుతంగా బంతులేశాడని మెచ్చుకున్నాడు. ఇక ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై న్యూజిలాండ్‌కు మెరుగైన రికార్డు ఉన్న నేపథ్యంలో.. తాము కోహ్లీసేనను తక్కువ అంచనా వేయడంలేదని స్పష్టంచేశాడు. టీమ్‌ఇండియాతో ఆడటం తనకు సంతోషంగా ఉంటుందని బౌల్ట్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని