IND vs SA: 14 ఏళ్ల తర్వాత కేఎల్‌ రాహుల్‌ రికార్డులశతకం

దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ (122 నాటౌట్‌; 248 బంతుల్లో 16x4, 1x6) ఆదివారం శతకం సాధించి ఆకట్టుకున్నాడు. దీంతో తొలి రోజు భారత్‌ పైచేయి సాధించడంలో...

Updated : 27 Dec 2021 11:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ (122 నాటౌట్‌; 248 బంతుల్లో 16x4, 1x6) ఆదివారం శతకం సాధించి ఆకట్టుకున్నాడు. దీంతో తొలి రోజు భారత్‌ పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే రాహుల్‌ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా గడ్డపై శతకం సాధించిన భారత రెండో ఓపెనర్‌గా రికార్డులకెక్కాడు. అది కూడా 14 ఏళ్ల తర్వాత సాధించడం గమనార్హం. ఇంతకుముందు మాజీ బ్యాట్స్‌మన్‌ వసీమ్‌ జాఫర్‌ 2007 పర్యటనలో దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టీమ్‌ఇండియా తరఫున శతకం (116) బాదిన ఓపెనర్‌గా నిలిచాడు. మళ్లీ ఇన్నాళ్లకు రాహుల్‌ ఆ ఘనత సాధించాడు.

మరోవైపు రాహుల్‌ (90 నాటౌట్‌) 2018 పర్యటనలో శతకానికి చేరువైనా 10 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అంతకుముందు మురళీ విజయ్‌ (97), గౌతమ్‌ గంభీర్‌ (93) సైతం ఇలాగే స్వల్ప తేడాతో సెంచరీల ముందు ఔటయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో శతకం సాధించడం ద్వారా రాహుల్‌ మరో కీర్తికిరీటాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌ దేశాల్లో సెంచరీలు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అలాగే పాకిస్థాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ సయీద్‌ అన్వర్‌, వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ తర్వాత ఆసీస్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ దేశాల్లో సెంచరీలు బాదిన మూడో ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గానూ రికార్డు నెలకొల్పాడు. కాగా, తొలి రోజు ఆటలో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (60; 123 బంతుల్లో 9x4)తో కలిసి తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించిన అతడు.. తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (35; 94 బంతుల్లో 4x4)తో మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించాడు. అనంతరం అజింక్య రహానె (40 నాటౌట్‌; 81 బంతుల్లో 8x4)తో కలిసి చివరివరకూ క్రీజులో పాతుకుపోయాడు. దీంతో ఆట ముగిసే సమయానికి భారత్‌ 272/3 స్కోర్‌ సాధించి పటిష్ఠస్థితిలో నిలిచింది. ఇక రెండో రోజు రాహుల్‌ ఇంకెన్ని పరుగులు చేస్తాడో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని