Updated : 04/12/2021 18:26 IST

IND vs NZ : ఆ ఒక్కటి మినహా.. సంపూర్ణ ఆధిక్యం టీమ్‌ఇండియాదే

ముగిసిన ఆఖరి టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఆట

కివీస్‌ బౌలర్‌ అజాజ్‌ పటేల్ పది వికెట్ల ప్రదర్శన

ఇంటర్నెట్‌ డెస్క్‌: పర్యాటక జట్టుకు దిమ్మతిరిగే షాక్‌ ఇస్తూ.. టీమ్‌ఇండియా బౌలర్లు రెచ్చిపోయారు. పాపం కివీస్‌ బౌలర్‌ అజాజ్ పటేల్ పది వికెట్లు తీశాడన్న ఆనందం కాసేపు కూడా వారి మోముల్లో లేకుండా చేశారు. కట్టుదిట్టమైన లెంగ్త్‌తో బంతులను సంధించి రెండు గంటల్లోనే కేవలం ముప్పై ఓవర్లలోపే న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కుప్పకూల్చారు. అయితే రెండో టెస్టుపై పూర్తి పట్టు సాధించేందుకు మళ్లీ బ్యాటింగ్‌కు దిగింది టీమ్ఇండియా. తొలి టెస్టులో అందినట్టే అంది చేజారిన విజయం ఈ సారి మాత్రం మిస్‌ కాకూడదంటే మూడో రోజు ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం నిర్దేశించి మరోసారి వారి భరతం పట్టాల్సిందే. 

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసింది. టీమ్‌ఇండియా అన్ని రంగాల్లో రాణించి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. అనంతరం కివీస్‌ను కేవలం 62 పరుగులకే కుప్పకూల్చి తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం (263) సాధించింది. అనంతరం ఫాలో-ఆన్‌ కూడా ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌ ఇవాళ ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 69 పరుగులు చేశారు. క్రీజ్‌లో మయాంక్‌ అగర్వాల్ (38*), పుజారా (29*) ఉన్నారు. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ బ్యాటింగ్‌కు దిగలేదు. ఫీల్డింగ్‌ చేస్తున్న క్రమంలో కుడి మోచేతికి గాయమైంది. దీంతో అతడి స్థానంలో పుజారా ఓపెనింగ్‌కు వచ్చాడు. టీమ్ఇండియా ఇప్పటి వరకు 332 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. కివీస్ బౌలర్‌ అజాజ్‌ పటేల్‌ (10/119) పది వికెట్ల ప్రదర్శన చేయడమే పర్యాటక జట్టుకు ఆనందాన్నిచ్చే అంశం.

అశ్విన్‌, సిరాజ్‌ దెబ్బకు కుదేలు

రెండే రెండు గంటల్లో కివీస్‌ ఇన్నింగ్స్ పేక మేడలా కుప్పకూలింది. కేవలం 28.1 ఓవర్లలో 62 పరుగులకే ఆలౌటైన కివీస్‌‌.. భారత్‌లో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఫాస్ట్‌ బౌలర్‌ జేమీసన్‌ (17), ఓపెనర్‌, కెప్టెన్‌  టామ్‌ లేథమ్‌ (10) మినహా ఎవరూ రెండంకెల స్కోరు సాధించలేదు. అశ్విన్‌ (4/8), సిరాజ్‌ (3/19), అక్షర్‌ పటేల్‌ (2/14), జయంత్‌ యాదవ్‌ (1/13) కివీస్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో విల్‌ యంగ్ 4, డారిల్‌ మిచెల్‌ 8, రాస్‌ టేలర్‌ 1, హెన్రీ నికోల్స్‌ 7, టామ్ బ్లండెల్ 8, రచిన్‌ రవీంద్ర 4 పరుగులు చేశారు. 

ఒకే ఒక్కడు.. అజాజ్‌ 

భారత్‌ 325 పరుగులకే కట్టడి కావడానికి ప్రధాన కారణం కివీస్‌ బౌలర్‌ అజాజ్‌ పటేల్ (10/119). ఓ పక్క భారత ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్ (150) అద్భుత పోరాటం చేయగా.. మయాంక్‌కు అక్షర్‌ పటేల్‌ (52), శుభ్‌మన్‌ గిల్‌ (44), వృద్ధిమాన్‌ సాహా (27) సహకరించారు. మిగతా కివీస్ బౌలర్లు పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా.. అజాజ్‌ మాత్రమే రెండు రోజుల ఆటలో అద్భుత ప్రదర్శన చేశాడు. భారత బ్యాటర్లకు కొరకరాని కొయ్యలా మారిన అజాజ్ మొత్తం పది వికెట్లను తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించాడు. ఓవర్‌ నైట్‌ స్కోరు 221/4తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమ్‌ఇండియా మరో 104 పరుగులను జోడించి మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని